'డీప్‌ఫేక్‌'లను అడ్డుకునేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్

by S Gopi |
డీప్‌ఫేక్‌లను అడ్డుకునేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్
X

దిశ, టెక్నాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్‌లను నియంత్రించడానికి వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు మెటా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్(ఎంసీఏ), మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు ఇరు సంస్థలు సోమవారం ప్రకటనలో వెల్లడించాయి. హెల్ప్‌లైన్ ద్వారా ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌కు డీప్‌ఫేక్, నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందని, ఈ ఏడాది మార్చి కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు మెటా తెలిపింది. ఈ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోనూ సేవలందిస్తుందని మెటా పేర్కొంది. 'ఏఐ కారణంగా వైరల్ అవుతున్న నికిలీ సమాచారం గురించి ఉన్న ఆందోళనలను గమనిస్తున్నాం. దీని పరిష్కారానికి మొత్తం టెక్ పరిశ్రమ నుంచి సహకారం అవసరమని మేము భావిస్తున్నామని మెటా పబ్లిక్ పాలసీ ఇండియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీప్‌ఫేక్ ద్వారా జరిగే మోసాలను నిలువరించేందుకు ఎంసీఏ సహకారంతో వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. గతవారంలోనే మైక్రోసాఫ్ట్, మెటాల్, గూగుల్, అమెజాన్, ఐబీఎంతో సహా ప్రపంచవ్యాప్తంగా 20 ప్రముఖ టెక్ కంపెనీల బృందం 2024 ఎన్నికలకు ముందు ఏఐతో నకిలీ సమాచారాన్ని నియంత్రించేందుకు అవసరమైన ఒప్పందంపై సంతకం చేశాయి.

Advertisement

Next Story