గ్రేట్ ‘ధరణి’లో ‘అపరిచితుడి’కి పట్టా

by Anukaran |   ( Updated:2021-07-03 09:21:24.0  )
గ్రేట్ ‘ధరణి’లో ‘అపరిచితుడి’కి పట్టా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సామాన్యులు తమ భూమి మాయమైందని, పేర్లు తప్పు పడ్డాయని, విస్తీర్ణం తక్కువగా రాశారని, పట్టాదారు పాసు పుస్తకం రాలేదని.. ఇలా సవాలక్ష సమస్యలతో అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ.. వీళ్ల భూ హక్కుల్లో లోపాలు ఎందుకు తలెత్తలేదు. వాళ్ల పట్టాదారు పాసు పుస్తకాల నుంచి భూమి ఎందుకు గల్లంతు కాలేదు. అందరికీ భూములు ఉన్నాయి. వారి భూమి హక్కులకు మాత్రం సమస్య రాలేదు. సామాన్య రైతుల భూ హక్కులకే ఎందుకు చిక్కులు ఎదురవుతున్నాయి. అంటే ధరణికి వాళ్లు పరిచయం ఉన్నారా? ఎక్కడైనా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలకు రాని భూమి సమస్యలు మా లాంటి మధ్య తరగతి వారికే ఎందుకొస్తున్నాయి..”. ఇది ధరణి పోర్టల్​ద్వారా భూమి కోల్పోయి మూడేండ్ల నుంచి తిరుగుతున్న ఓ రైతు కొడుకు ప్రశ్న. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్​ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఆ విద్యావంతుడు సంధించిన సూటి ప్రశ్న. తన తండ్రికి తరతరాలుగా ఉన్న భూమిని వేరే వాళ్ల పేరు మీద రాసేశారు. అతడెవరో కూడా వీళ్లకు తెలియదు. వీళ్లకే కాదు.. రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి కూడా తెలియదు. అసలు భూమ్మీద ఉన్నాడో, లేడో కూడా తెలియని విచిత్ర పరిస్థితి. అందుకే తమ భూమి హక్కులకే సమస్య వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

ఇది 100 శాతం నిజమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఏ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల భూమి హక్కులకు కష్టం, నష్టం జరగలేదు. కానీ ప్రతి మండలంలోనూ పేద రైతుల భూముల డేటాలోనే గందరగోళం నెలకొంది. వేలాది మంది తమ భూమిని తగ్గించి రాశారని, సర్వే నంబర్లు మిస్​చేశారని, పేర్లు తప్పు రాశారని, పట్టాదారు పాసు పుస్తకం రాలేదని, వేరే వాళ్ల ఆధార్​నంబర్లు సీడ్​చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న, ఎన్నాండ్ల క్రితమో కొనుగోలు చేసిన పట్టా భూములను ప్రభుత్వ భూములంటూ ప్రొహిబిటెడ్​ప్రాపర్టీస్​లిస్టులో నమోదు చేశారు. మూడేండ్ల నుంచి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక ఆప్షన్‌లో దరఖాస్తు చేసుకుంటే అది కాదు.. మరో ఆప్షన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. తాజాగా పట్టా భూములను ఎవరి ఆమోదం లేకుండా, ఎవరి సంతకాలు చేయకుండానే రికార్డులను మార్చేసి అపరిచితులకు, పరాయి వ్యక్తుల పేరిట రాసిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

అపరిచితుడి పేరిట భూ మార్పిడి

= వరంగల్​రూరల్​జిల్లాలో మొగిలిచెర్లకు చెందిన ఓ రైతుకు గీసుకొండ సర్వే నంబరు 167లో 2.36 ఎకరాలు, 168బిలో 1.06 ఎకరాలు వంతున ఉంది. పట్టా భూమికి ఖాతా నంబరు ఇచ్చారు. గతంలో పట్టా పొందారు. తర్వాత రెవెన్యు శాఖ అధికారులు 1-Bలో నమోదైన వివరాలు సరైనవేనని యూనిక్ ఐడీ నంబరు ద్వారా నిర్ధారించారు. కానీ రికార్డుల ప్రక్షాళనలో గందరగోళానికి తెరలేచింది.

= ఆర్ఎస్ఆర్ పేరుతో 168బిలో 3 గుంటలు తగ్గించి 1.03 ఎకరాలకు, సర్వే నంబరు 167/1లో 1.02 భూమినే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదు చేశారు. 2018 మేలో పీపీబీ పంపిణీలో ఈ తప్పులు గుర్తించిన పట్టాదారుడు అవాక్కయ్యాడు. తన ఖాతాలో నుంచి మాయమైన మిగతా భూమికి బోనగిరి గణేష్ అనే వ్యక్తికి ఖాతా నం.1041తో 2018 మేలో పట్టా అయ్యిందని తెలుసుకొని ఆందోళన చెందారు. తీరా చూస్తే బోనగిరి గణేష్ పేరుతో గీసుగొండ మండలం, చుట్టుపక్కల ఎవరూ లేరని, ఆ పీపీబీ, రైతుబంధు చెక్కులు కూడా సదరు వ్యక్తి తీసుకోలేదు.

= అసలు తనకు తెలియకుండా పట్టా మార్పిడి ఎలా జరుగుతుందని, సంబంధిత ఆర్వోఆర్ ఫైల్ కూడా గీసుగొండ తహసీల్దార్ కార్యాలయంలో లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఇలా ఎలా చేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించడంతో ఆ అక్రమ పట్టాని ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 5-బి కింద అప్పీలు చేసుకుంటే విచారించి రద్దు చేస్తామని అధికారులు తేల్చారు.

= వాళ్లు చెప్పిన ప్రకారమే అప్పీలు చేసుకోగా, వరంగల్ రూరల్ ఆర్డీఓ నోటీసులు జారీ చేయగా, గీసుగొండ తహసీల్దార్ ఆ భూమి సదరు పట్టాదారుడేదని, బోనగిరి గణేష్‌కి ఆ ప్రాంతంలో భూమి లేదని, ఆ పేరున్న వ్యక్తే స్థానికంగా ఎవరూ లేరని చుట్టుపక్కల రైతుల వాంగ్మూలంతో 2019 సెప్టెంబరులో నివేదిక ఇచ్చారు.

= అది పెండింగులో ఉండగానే ఆర్డీఓ కోర్టు రద్దవడంతో ఆ కేసు స్పెషల్ ట్రిబ్యునల్‌కి బదిలీ అయ్యింది. మరొకమారు ఆ భూ సమస్యపై జిల్లా కలెక్టరు విచారించి బోనగిరి గణేష్ పట్టా రద్దు చేసి, 167/2 (ఎకరాలు 1.34), 168లో తొలగించిన 0.03 గుంటలు కూడా సదరు రైతు పేరుతో రికార్డులో సవరించాలని, మరోసారి ఆధారిత దస్తావేజులతో తహసీల్దారుడికి దరఖాస్తు చేసుకోవాలని 2021 ఫిబ్రవరిలో డిక్రీ ఇచ్చారు.

= ఈలోపు ధరణిలో తహసీల్దార్లకి డిజిటల్ సైన్ ఆప్షన్ తీసేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్సుల క్రింద అర్జీ చేసుకుంటే దానిపై విచారణ చేసిన తహసీల్దార్ సానుకూలంగా కలెక్టరేట్‌కి నివేదిక పంపిస్తే, దాన్ని కూడా అక్కడి సెక్షన్ అధికారులు తిరస్కరించారు. అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకుందామని రైతు కొడుకు కలెక్టరేట్‌కి వెళ్తే అక్కడి అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. కోర్టు కేసుల అంశాలకు ధరణిలో ప్రత్యేక విభాగం కింద అర్జీ చేసుకుంటేనే తాము పరిష్కరిస్తామని తేల్చేశారు.

తెలియకుండానే పంచేశారు

సిద్ధిపేట జిల్లాలో ఓ రైతుకు ఐదెకరాల భూమి ఉంది. ఖరీదైన ప్రాంతంలోనే ఉంది. పట్టాదారుడు చనిపోయాడు. జాగ పంపకాలు చేసుకోలేదు. పట్టాదారుడి చిన్న కొడుకు వేరే ప్రాంతంలో ఉంటారు. ఈ క్రమంలో అతడికి తెలియకుండానే పెద్ద కొడుకు కుటుంబానికి చేసేశారు. కుటుంబంలో మొదట చర్చ జరిగింది. చిన్న కొడుకు వాటా ఇచ్చేందుకు మొదట ఒప్పుకున్నారు. వాళ్లకు పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన తర్వాత ససేమిరా అంటున్నారు. ధరణి నిర్లక్ష్యమో, అధికారుల పొరపాటో గానీ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇక సమానమైన హక్కుల కోసం సివిల్​కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.

ఆమోదం లేకుండానే..

అసలు తమకి తెలవకుండా సంబంధిత ఆర్వోఆర్ ఫైల్ లేకుండా భూమ్మీదే లేని వ్యక్తికి భూమిని ఎలా పట్టా చేస్తారన్న బాధితుడి ప్రశ్నకు రెవెన్యూ అధికారుల దగ్గర సమాధానం లేదు. అసలు తప్పిదాల్ని సవరించడానికి కూడా ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కపెట్టి ఏండ్ల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. విచారణ పేరుతో జాప్యం చేసి, చివరికి వచ్చిన డిక్రీని అమలు చేయమని అర్జీ పెట్టుకుంటే, ధరణిలో సాంకేతిక అంశాల పేరుతో తిరస్కరిస్తే, ఈ తప్పులకు తామెందుకు నష్టపోవాలని బాధితుడి కొడుకు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు చేసిన ఈ దారుణమైన తప్పిదాల వల్ల తామెందుకు విలువైన సమయం, డబ్బు కోల్పోవాలని, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఎవరూ దరఖాస్తు చేసుకోకపోయినా ఒక్కరిపైనే మొత్తం విస్తీర్ణాన్ని రాసిన అధికారులను ఎందుకు శిక్షించరని నిలదీస్తున్నారు. వీళ్ల పొరపాటే లేకపోతే ధరణి పోర్టల్‌లో అప్ లోడ్​చేసిన డేటాను సరిదిద్దాలని డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story