కెప్టెన్‌గా గబ్బర్.. టీమ్ ఇండియా ముందు మరో సవాల్

by Anukaran |
కెప్టెన్‌గా గబ్బర్.. టీమ్ ఇండియా ముందు మరో సవాల్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఆడిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ ప్రయాణమైన టీమ్ ఇండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి చాలా కారణాలు చెబుతున్నా.. క్రీడా నిపుణులు హైలైట్ చేస్తున్న ఒకే ఒక తప్పిదం మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం. కోహ్లీ, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే వంటి టాపార్డర్ బ్యాట్స్‌మాన్ ఎన్నో టెస్టులు ఆడిన అనుభవం ఉన్నా.. నెలన్నరకు పైగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా హోటల్ గదులకు పరిమితం అవడం వారి ఆటపై ప్రభావం చూపింది. తాజాగా భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్నది. 20 మందితో కూడిన యువ జట్టులో కొంత మందికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం కూడా లేదు. మే 4న ఐపీఎల్ వాయిదా పడగా.. అప్పటి నుంచి ఎవరూ బ్యాట్ పట్టింది లేదు బంతి విసిరింది లేదు. ప్రస్తుతం ముంబైలోని స్టార్ హోటల్‌లో తమ గదులకే పరిమితం అయ్యారు. మే 28 తర్వాత వీరందరూ కొలంబో బయలుదేరి వెళ్తారు.

ఇంత వరకు ప్రాక్టీస్ లేదు..

మే 14న ముంబైలోని హోటల్‌కు చేరుకున్న టీమ్ ఇండియా యువ జట్టు హోటల్ గదులకే పరిమితం అయ్యింది. వచ్చే వారంలో కొలంబోకి ప్రయాణం అవనున్న వీరందరూ మూడు రోజుల పాటు అక్కడ కూడా క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టే అవకాశం ఉన్నది. కేవలం నెట్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నది. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి చాన్నాళ్లు అవడంతో అంత త్వరగా శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడతారా లేదా అనేది అనుమానంగా మారింది. దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రాణా, క్రిష్ణప్ప గౌతమ్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా వంటి క్రికెటర్లకు ఇదే తొలి అంతర్జాతీయ పర్యటన. భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శ్రీలంకలో రాణిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఐపీఎల్‌లో వీరి ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అదే ఫామ్‌ను విదేశీ పర్యటనలో కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నది.

ద్రవిడ్ పైనే భారం..

భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ఈ యువ జట్టుతో శ్రీలంక వెళ్లనుండటం ఊరట కలిగించే విషయం. గతంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన ద్రవిడ్.. ఆ తర్వాత ఇండియా ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఆ రెండు జట్ల నుంచి అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న పృథ్వీషా, మనీశ్ పాండే, సంజూ శాంసన్ వంటి క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఎదిగిన వారే. ఇక అతడికి తోడు ఎన్ఏసీ బృందం కూడా ఉండటంతో టీమ్ ఇండియాకు కలసి వచ్చే అంశం, మరోవైపు ఎంతో అనుభవం కలిగిన శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా ఉండటం కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచనున్నది. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఒత్తిడిలో బౌలింగ్ చేయగలిగే యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. దీపక్ చాహర్ రాణించాల్సిన అవసరం ఉన్నది. కాగా, అనుభవజ్ఞులు, యువకులతో కూడిన భారత జట్టు సమ తూకంతో కనిపిస్తున్నా.. కనీసం రెండు మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉంటే లంక పరిస్థితులకు అలవాటు పడే అవకాశం ఉండేదని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. మరి ఈ జట్టు ఏం చేస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed