ఉపాధ్యాయులకు ‘హరిత’ టెన్షన్

by Shyam |   ( Updated:2020-08-12 22:24:17.0  )
ఉపాధ్యాయులకు ‘హరిత’ టెన్షన్
X

దిశ, ప్రతినిధి, హైదరాబాద్:

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంతో ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లలో ఉపాధ్యాయులు విధిగా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు సరిపడా స్థలంతో పాటు ఇతర వసతులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం నిర్ధేశించిన సంఖ్యలో మొక్కలు నాటలేని పరిస్థితి నెలకొంది. దీనికి బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ ఏకంగా డీఈఓకు మొమో జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులలో వణుకు మొదలైంది.

పట్టుమని వంద మంది నిల్చోలేని పాఠశాలల్లో వందల మొక్కలు ఎలా నాటాలో తెలియక ఉపాధ్యాయులు కంగారుపడుతున్నారు. ప్రభుత్వం ట్రీ గార్డులు సరఫరా చేయకుండానే మొక్కలు సంరక్షించాలనడం ఎంత వరకు సబబని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జిల్లాలోని చాలా చోట్ల పాఠశాలలకు ఎత్తైన ప్రహారీ గోడలు లేక పోవడం వారి పాలిట శాపంగా పరిణమించింది. పాఠశాలల పరిసర ప్రాంతాల పిల్లలు గోడలు దూకి ప్రాంగణంలో ఆటలాడుతుండడం, కొన్ని చోట్ల పశువులు మేయడం వంటి ఇతరత్రా కారణాలతో మొక్కలు నాటిన కొన్ని రోజులకే ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. దీనికి ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

వసతులు లేకుండా ఎలా..?

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటడానికి రెడీగా ఉన్నామని, వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో ప్రతి యేటా మొక్కలు నాటుతున్నామని, వాటిని సంరక్షించేందుకు చర్యలు కరువై మొక్కలు చనిపోతున్నాయని చెబుతున్నారు. నీళ్లు, ట్రీ గార్డులు ఇవ్వకుండా మొక్కలు ఎలా దక్కుతాయని ప్రశ్నిస్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రేయర్ చేయడానికే స్థలం కొరత ఉందని, అక్కడ మొక్కలు ఎలా నాటాలి, వాటిని ఎలా కాపాడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో వంద మొక్కలు నాటమని చెప్పి అధికారులే అరవై మొక్కలు సరఫరా చేశారని, అనంతరం మొక్కలు తక్కువ నాటారని చెబుతూ మొమోల ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనా నేపథ్యంలో కలెక్టర్ తీరు సరిగ్గా లేదని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కలెక్టర్ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యాచరణ నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

డీఈఓకు మెమో..

హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పని తీరు ఏ మాత్రం బాగా లేదని, ఈ విషయంలో అట్టడుగున ఉండటానికి గల కారణాలు సంజాయిషీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 4న డీఈఓ కు మెమో జారీ చేశారు. జిల్లా లోని ప్రతి మండలంలో కనీసం ఐదు పాఠశాలలు ఎంపిక చేసి వాటిల్లో మొక్కలు నాటాలని గతంలో ఆదేశాలు జారీ చేశామని, ఈ మేరకు మొక్కలు నాటారా ? లేదా ? అనేది పాఠశాలల డిప్యూటీ ఇన్ స్పెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు సంయుక్తంగా తనికీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

వారు ఇచ్చిన నివేధిక ఆధారంగా హరితహారం కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని, మొక్కలు నాటడంలో పనితీరు సక్రమంగా లేని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ శ్వేతా మహంతి జిల్లా డీఈఓ వెంకటనర్సమ్మకు మెమో జారీ చేశారు.

Advertisement

Next Story