జనసేన, బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తా : చింతమనేని

by Anukaran |
జనసేన, బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తా : చింతమనేని
X

దిశ, వెబ్ డెస్క్: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే ఏపీలో తెలియని వారు ఉండరు. చింతమనేని ఏం చేసినా సంచలనమే. అందుకే ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన జైలుకు సైతం వెళ్లొచ్చారు. బెయిల్ పై విడుదలైన తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న చోట జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారంలో పాల్గొంటానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్‌లో జరుగుతున్న ఎన్నికల పరిణామాల తీరుపై చింతమనేని అసహనం వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటున్నారని చింతమనేని ధ్వజమెత్తారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదన్నారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని చింతమనేని హామీ ఇచ్చారు. విత్ డ్రా చేసుకున్న టీడీపీ అభ్యర్థుల డివిజన్‌లలో జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉంటే వారి తరుపున ప్రచారంలో పాల్గొంటానని చింతమనేని ప్రకటించారు. చింతమనేని ప్రకటనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉంటే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ నేత చింతమనేని ప్రభాకర్ జోక్యం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story