AP News : జగన్.. ఇది నమ్మకద్రోహం కాదా ? : అచ్చెన్నాయుడు

by srinivas |   ( Updated:2021-10-27 03:46:09.0  )
Acchennayudu-11
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ పాలనలో రైతుల ఇళ్లల్లో చీకటి కాంతులే తప్ప వెలుగులు లేవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతు భరోసాలో అంకెల గారడీ తప్ప అసలు ఎంత విడుదల చేశారో తెలియడం లేదన్నారు. అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల లోగిళ్లలో చీకటి కాంతులు నింపి కోట్ల రూపాయల ప్రకటనలతో సీఎం వైఎస్ జగన్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసాలో అంకెల గారడీతో అన్నదాతలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? అని నిలదీశారు. మంగళవారం రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం రూ.30 కోట్లు మాత్రమేనని, కానీ రూ.1213 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా పేరుతో రూ.18,777 కోట్లు చెల్లించామనేది పచ్చి అబద్ధమన్న ఆయన ఇందులో 60శాతం వరకు నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని చెప్పుకొచ్చారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జగన్ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, మరోవైపు పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తుంటే.. జగన్ మాత్రం పెద్దఎత్తున సాయం అంటూ వందల కోట్ల రూపాయల ప్రకటనలతో వారిని మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం 45 లక్షల మందికి కుదించారని.. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 41వేలకు కుదించారని?? ఇది నమ్మకద్రోహం కాదా? అని ప్రశ్నించారు. ఒకేదఫాలో రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారని ఇది ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారని ప్రకటనలో వెల్లడించారు. ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రూ.37,500 మాత్రమే ఇస్తూ రూ.67,500 ఇస్తున్నట్లుగా అసత్యాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.

రైతు పథకాన్ని రద్దు చేశారు

‘సాగునీటి ప్రాజెక్టులను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు హయాంలో 23 ప్రాజెక్టులు పూర్తిచేసి 32 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో చంద్రబాబు రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశారు. మూడు విడతలలో రుణమాఫీ కింద రూ.15,279 కోట్లు రైతుల ఖాతాలలో చంద్రబాబు జమ చేశారు. రూ.50వేల లోపు రైతు రుణాలను ఒకే దఫాలో రద్దు చేశారు. రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు రూ.1,10,000 లబ్ధి పొందారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే.. 4, 5 విడతల రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు రూ.40 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో 1,15,000 వచ్చి ఉండేవి. జగన్ ఇస్తున్నది కేవలం రూ.37,500 మాత్రమే. జగన్ రైతు వ్యతిరేక విధానాలతో రెండున్నరేళ్లలో సుమారు 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం చెల్తిస్తామని చెప్పి మోసం చేశారు. రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుకే సున్నా వడ్డీ పరిమితం చేస్తూ జీవో 464 విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో రైతు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేది. జగన్‌ పాలనలో వడ్డీని రైతు బ్యాంకుకు ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి. జగన్ రెడ్డి పాలనలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం అటకెక్కింది. రైతు రథం పథకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు యంత్ర సేవా పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. రైతుకు ఇప్పటి వరకు ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాన్ని కూడా అందజేయలేదు. ఇప్పటికైనా అంకెల గారడీ మానుకుని కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story