ఓటమి భయంతోనే ఐటీ సోదాలు,, త్వరలో ఈడీ, సీబీఐ : అఖిలేష్ యాదవ్ ఫైర్

by Shamantha N |   ( Updated:2021-12-18 11:01:48.0  )
akilesh yadav
X

లక్నో: తమ పార్టీ నేతలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తుందని మండిపడ్డారు. రాయ్‌బరేలీలో శనివారం విజయ్ యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటివరకు ఐటీ అధికారులు మాత్రమే వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఈడీ, సీబీఐ అధికారులు కూడా వస్తారు. కుట్రలు వ్యాప్తి చెందుతాయి. కానీ బీజేపీ పూర్తిగా ఉత్తరప్రదేశ్ నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. ఎన్నికల ముందే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు? వారి దగ్గర సమాచారం ఉంటే, ఇంతకు ముందు ఎందుకు చేయలేదు.

రాజీవ్ రాయ్ పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలు దగ్గరికి వస్తుంటే, యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంస్థలు కూడా వస్తున్నాయి’ అని విమర్శించారు. అంతకుముందు ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్‌కు చెందిన నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దీనిపై రాజీవ్ స్పందిస్తూ ‘వారు సోదాల చేయడానికి వచ్చారు. నేను ఎలాంటి అడ్డు చెప్పలేదు. కర్ణాటకలోని నా నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయం కాకపోతే, ఎన్నికల ముందే ఈ దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో దాచుకోవడం, భయపడాల్సిన అవసరం లేదు. అమిత్ షాకు చెందిన వ్యక్తుల ఇండ్లపై దాడులు చేయాలని నేను సవాల్ చేస్తున్నాను’ అని అన్నారు. కాగా ఐటీ అధికారులు ఎస్పీకి చెందిన మరో ఇద్దరు నాయకులు మనోజ్ యాదవ్, జైనేంద్ర యాదవ్ నివాసాల్లోనూ సోదాలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed