ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీకు గుడ్ న్యూస్

by Harish |   ( Updated:2021-10-25 06:31:44.0  )
ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా రాబోయే నాలుగేళ్లలో కొత్తగా 10 ఈవీ వాహనాలను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టాటా మోటార్స్ సంస్థ భారత మార్కెట్లో రెండు ఈవీ వాహనాలతో ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోంది.

‘ప్రస్తుతం సంస్థ నెక్సాన్, టిగోర్ వాహనాల కోసం నెలకు 3,000-3,500 యూనిట్ల బుకింగ్‌లను సాధిస్తున్నాం. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు సుమారు 1,000 యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాం. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా రాబోయే రోజుల్లో 10 కొత్త గ్రీన్ మొబిలిటీ వాహనాలను లాంచ్ చేసేందుకు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, ఛార్జింగ్ లాంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం వినియోగించనున్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.

రానున్న రోజుల్లో సంస్థ నుంచి వచ్చే అన్ని కొత్త వాహనాల్లో ఎక్కువ భాగం కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గతవారమే టాటా మోటార్స్ తన మినీ-ఎస్‌యూవీ ‘పంచ్’ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ వాహనాలకు మరింత గిరాకీ పెరుగుతుందని ఆశిస్తున్నట్టు శైలేష్ చంద్ర వెల్లడించారు.

Advertisement

Next Story