ప్యాసింజర్ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్!

by Harish |   ( Updated:2021-08-02 21:40:22.0  )
ప్యాసింజర్ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. వాహనాల వేరియంట్, మోడల్‌ని బట్టి సగటున 0.8 శాతం పెంచింది. కొత్త ధరలు మంగళవారం(ఆగష్టు 3) నుంచి అమల్లోకి రానున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఆగష్టు 31లోపు రిటైల్ చేసే వాహనాలను ఈ ధరల పెంపు నుంచి మినహాయిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘టాటా మోటార్స్ సంస్థ వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను రక్షించేందుకు సమగ్రమైన బిజినెస్ ఎజిలిటీ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఉక్కు, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ వ్యయాన్ని భర్తీ చేసేందుకు ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచినట్టు కంపెనీ వివరించింది. ప్రస్తుతం టాటా మోటార్స్ టియాగో, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, ఇప్పటికే పలు వాహన తయారీ కంపెనీలు తమ కార్లపై ధరలను పెంచాయి. దిగ్గజ ప్యాసింజర్ కార్ల సంస్థ మారుతీ సుజుకి ఇన్‌పుట్ ఖర్చుల వ్యయం కారణంగా సీఎన్‌జీ, పలు హ్యాచ్‌బ్యాక్ కార్లపై రూ. 15 వేల పెంపును ప్రకటించింది. హోండా సైతం పలు మోడళ్లపై ధరలను పెంచింది.

Advertisement

Next Story