తమిళనాడులో దారుణం.. లాక్‌డౌన్‌లో బయటకొచ్చాడని కొట్టి చంపిన పోలీసులు

by Sumithra |
తమిళనాడులో దారుణం.. లాక్‌డౌన్‌లో బయటకొచ్చాడని కొట్టి చంపిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్ :కరోనా మహమ్మారి ధాటికి దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అక్కడక్కడా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. అయితే, తమిళనాడులో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఇంకా నిర్భంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని చితకొట్టారు. అతను ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. వివరాల్లోకివెళితే.. లాక్‌డౌన్ లో ఎవరూ బయటకు రాకూడదని అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే, మురుగేషన్ (40) అనే వ్యక్తి పనిమీద సేలం నుంచి ధర్మపురికి బయలుదేరాడు.

మార్గమధ్యలో ఎడప్పురి చెక్ పోస్టు వద్ద అతన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. బయటకు ఎందుకు వచ్చావని చితకబాదారు. కొట్టొద్దని మురుగేషన్ ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దెబ్బలకు తాళలేక చివరకు అతను మరణించాడు. విషయం తెలియడంతో స్టేట్ వైడ్ సంచలనం అవ్వగా.. పలువురు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆరా తీసిన ఉన్నతాధికారులు మురుగేషన్ మరణానికి కారణమైన ఎస్సై సహా మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, మృతుడు మద్యం సేవించి తమతో వాదనకు దిగాడని, దీంతో తాము కొట్టాల్సి వచ్చిందని పోలీసులు ఆరోపించారు.

Advertisement

Next Story