వలస కూలీల జాబితా సిద్ధం చేయండి: మంత్రి తలసాని

by Shyam |
వలస కూలీల జాబితా సిద్ధం చేయండి: మంత్రి తలసాని
X

దిశ, న్యూస్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులేని బియ్యం పంపిణీ చేయాల్సిన వలస కూలీల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కార్మికులు తదితర అంశాలపై మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్‌తో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,జీహెచ్ఎంసీ నగర పరిధిలో ఎవరు పడితే వారు ఆహారం పంపిణీ చేయడం వలన యాచకులు గుమిగూడుతున్నారనీ, ఇక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఆహార పంపిణీ జరగాలన్నారు. రోడ్లపై సంచరిస్తున్న యాచకులను సమీపంలోని షెల్టర్ హోంలకు తరలించాలని అధికారులకు సూచించారు. షెల్టర్‌కు తరలించిన యాచకులకు భోజనం పెట్టడంతో పాటు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్‌లో తాత్కాలిక షెల్టర్, హోంలు ఏర్పాటు చేయాలన్నారు. లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ లేనందున రోడ్ల నిర్మాణం జరుగుతోందనీ, వాటి నిర్వహణ బాధ్యత 5 ఏళ్ల పాటు గుత్తేదారుదేనన్నారు. తమ పరిధిలో జరిగే రోడ్ల నిర్మాణాలను స్థానికి ప్రజాప్రతినిధులు పరిశీలించాలని తలసాని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: hyderabad, lockdown, beggars, shelter homes, food distribution, migrant labour list

Advertisement

Next Story

Most Viewed