- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడే దాయాదుల సమరం.. భారత్, పాక్ మధ్య బిగ్ ఫైట్
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఆ రెండు జట్లు తలపడితే మజానే వేరు. ఆ రోజుకు ఆ మ్యాచే ప్రత్యేకత. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అనగానే క్రికెట్ అంటే తెలిసిన వారు, తెలియని వారు ప్రతి ఒక్కరూ టీవీ ముందే ఉంటారు. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్‌లో అయితే ఆ రెండు జట్లు ఎదురుపడితే బిగ్ ఫైట్‌గానే అభివర్ణిస్తారు. ఆ జట్లే ఇండియా, పాకిస్తాన్. క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడితే ఆ కిక్కే సపరేటు. 2019 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్-2021లో దాయాదుల పోరు కోసం ఫ్యాన్స్ ఊవిళ్లురుతున్నారు. ఈ బ్లాక్ బాస్టర్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్‌లో భారత్ ,పాకిస్తాన్ జట్లును గ్రూపు-2లో చేర్చారు. ఈ జట్లతోపాటు అప్ఘానిస్తాన్, న్యూజీల్యాండ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్నాయి. సూపర్-12 రౌండ్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి గ్రూపు-1లోని శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తొలి మ్యాచ్ ఆడగా.. రాత్రి ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్, పాక్ మ్యాచ్ కోసమే అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ జట్లు అద్భుతంగా రాణించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీస్‌లను కైవసం చేసుకుంది. మరోవైపు, టీమ్ ఇండియా సైతం పటిష్టంగానే ఉంది. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన వారే జట్టులో ఉండటం అదనపు బలం. ఇంకోవైపు, వార్మప్ మ్యాచ్‌ల్లో మేటి జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తు చేసి భారత్ ఆత్మవిశ్వాసంలో ఉన్నది. ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మరింత హీట్ పెంచనుంది.
పటిష్టంగా భారత్
ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై విజయం సాధించి టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే, ఐపీఎల్ 2021లో ఆడిన పిచ్‌లే కావడం భారత క్రికెటర్లకు సానుకూలంశం. భారత జట్టుకు ఎంపికైన వారందరూ ఐపీఎల్‌లో సత్తాచాటినవారే. అలాగే, టీమ్ ఇండియాకు మెంటార్‌గా ధోనీ ఉండటం అదనపు బలం. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించిన అనుభవంతోపాటు.. టీ20 క్రికెట్‌లో ధోనీకి మంచి వ్యూహరచన ఉంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా రానున్నారు. వీరిద్దరూ వార్మప్ మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రాణిస్తే.. భారీ స్కోరు ఖాయమే. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ రానున్న కెప్టెన్ కోహ్లీ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ చక్కటి ఇన్నింగ్స్ భావిస్తున్నది. నాలుగో స్థానంలో సూర్యకుమార్ రానున్నాడు. ఇషాన్ కిషన్ ఫామ్‌లోనే ఉన్నా.. పాక్‌తో మ్యాచ్ నేపథ్యంలో సూర్యకుమార్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఫినిషర్ బాధ్యతల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. పేస్ దళంలో షమీ, బుమ్రాతోపాటు భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్‌లో ఒకరికి చాన్స్ దక్కనుంది. స్పిన్ బౌలింగ్‌లో జడేజాకు జోడీగా రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ల వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే చాన్స్ ఉంది.
పాకిస్తాన్‌ను అంచనా వేయలేం..
ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ అద్భుత విజయాలు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీస్‌లు గెలుచుకుంది. ఈ ఆత్మవిశ్వాసంతోనే పాక్ టీ20 వరల్డ్ కప్ బరిలో నిలిచింది. అయితే, పాకిస్తాన్ జట్టును అంచనా వేయడం కష్టమే. అందుకు కారణం జట్టు అనిశ్చితే కారణం. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటం.. టఫ్ ఫైట్‌లో పాక్ బ్యాటర్లు రాణించి గెలిపించడం ఆ జట్టుకు అలవాటుకు మారింది. వార్మప్ మ్యాచ్‌ల్లో డిపెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ గెలిచినా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టీమ్ ఇండియాతో ఆడే జట్టును పాకిస్తాన్ శనివారం ప్రకటించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టుకు ప్రధాన బలం. టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బాబర్ అర్ధ సెంచరీతో రాణించాడు. మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి బాబర్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చే ఫకర్ జమాన్ రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో ఎంతో అనుభవం కలిగిన షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ బరిలోకి దిగనున్నారు. టచ్‌లో ఉన్న ఆసిఫ్ అలీ 6వ స్థానంలో రానున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్లు అయిన ఈ ఇద్దరు యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. హసన్ అలీ, షాహిన్ షా అఫ్రిది, హ్యారిస్ రౌఫ్‌తో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురు మంచి ఫామ్‌లో ఉన్నారు. మొత్తానికి పాక్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.
టీమ్ ఇండియాదే పైచేయి..
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్‌లో ఇరు జట్లు 5సార్లు తలపడగా.. ఐదింటిలోనూ టీమ్ ఇండియానే విజయం సాధించింది. 2007లో పొట్టి ప్రపంచకప్‌లో తొలిసారి ఇరుజట్లు తలపడగా.. మ్యాచ్ టై అయ్యింది. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. అదే టోర్నమెంట్‌లో ఇండియా, పాక్ జట్లు ఫైనల్ చేరాయి. పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా విజయం సాధించి ధోనీ సేన అరంగేట్ర టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. 2012 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్‌లో పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లతో విజయం సాధించింది. 2014లోనూ గ్రూపు దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపొంది. 2016 వరల్డ్ కప్‌లో సూపర్-10 రౌండ్‌లో ఇరు జట్లు పోటీపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్ కట్టడి చేసింది. ఆ తర్వాత టీమ్ ఇండియా నాలుగు వికెట్లు నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.
తుది జట్లు అంచనా :
టీమ్ ఇండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, సూర్యకుమార్ కుమార్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/భువనేశ్వర్
పాకిస్తాన్ : బాబర్ అజమ్ (కెప్టెన్) , ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహమ్మద్ రిజ్వాన్, వసీమ్, హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయాబ్ మాలిక్, హరిస్, హసన్ అలీ, షాహెన్ షా ఆఫ్రిది