- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ కప్ గెలిచేదెవరో?
దిశ, స్పోర్ట్స్: చిరకాల క్రీడా ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-న్యూజిల్యాండ్ టీమ్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేటి రాత్రి ప్రపంచ విజేత ఎవరన్నది తేలిపోనున్నది. ఈ మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ జట్లకు చెమటలు పట్టించి ఫైనల్‌కు చేరుకున్న ఈ రెండు టీమ్స్ టైటిల్ వేటకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. సూపర్ 12 దశలో ఈ రెండు జట్లు సాదాసీగానే ఆడాయి. కానీ సెమీఫైనల్స్‌లో మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టాయి.
గ్రూప్ 1లో టాపర్‌గా నిలిచిన ఇంగ్లాండ్ జట్టును సెమీస్‌లో న్యూజిల్యాండ్ ధీటుగా ఎదుర్కున్నది. అలాగే గ్రూప్ 2లో టాపర్ అయిన పాకిస్తాన్ రెండో సెమీస్‌లో చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించినా ఆసీస్ బ్యాటర్లు స్టొయినిస్, వేడ్ వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ప్రస్తుతం ఇరు జట్ల బ్యాటింగ్, బౌలింగ్ చూస్తే ఆసీస్ జట్టే కాస్త బలంగా కనిపిస్తున్నది. అలాగే వరల్డ్ కప్‌లో గత రికార్డులు కూడా ఆసీస్‌కే అనుకూలంగా ఉన్నాయి. కానీ క్రికెట్‌లో ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో చివరి బంతి వరకు మ్యాచ్ ఎటు టర్న్ అవుతుందో చెప్పలేం. రికార్డు ఆసీస్ వైపు ఉన్నా.. ఇటీవల ఫామ్ చూస్తే కివీస్‌ను కూడా తక్కువ అంచనా వేయలేము.
సమతూకంగా కివీస్…
వరల్డ్ కప్‌లలో వరుసగా ఫైనల్స్ చేరిన నాలుగో జట్టుగా న్యూజిల్యాండ్ రికార్డు సృష్టించింది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌తో పాటు 2021 టీ20 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకున్నది. తొలి రెండు టోర్నీల్లో ఓటమి పాలైనా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో మాత్రం అదరగొట్టింది. ఆ గెలుపు స్మృతులు ఇంకా తాజాగా ఉండగానే టీ20 వరల్డ్ కప్‌ఫైనల్స్‌కు చేరింది. గత కొన్నాళ్లుగా కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలో న్యూజిల్యాండ్ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నది. ఐసీసీ టైటిల్స్ గెలవలేదన్న అపవాదును చెరిపేస్తూ టెస్ట్ చాంపియన్‌గా నిలిచింది.
ఇక టీ20 వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కివీస్.. టీమ్ ఇండియాను ఓడించడం ద్వారా తాము రేసులో ఉన్నామని గుర్తు చేసింది. హాట్ ఫేవరెట్ పాకిస్తాన్‌పై ఓడిపోయినా.. సెమీస్‌లో చాలా బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్‌లు ఈ మెగా టోర్నీలో చక్కగా రాణించారు. కేన్ విలిమయ్‌సన్‌కు కీలక సమయాల్లో సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్నది.
టీ20 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గ్లెన్ ఫిలిప్ తన పూర్తి శక్తిసామర్థ్యాలను బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. జేమ్స్ నీషమ్ బ్యాటుతో మంచి టచ్‌లో ఉన్నాడు. డెవాన్ కాన్వే ఫైనల్‌కు దూరమవడం భారీ దెబ్బే అనుకోవచ్చు. అతడి స్థానంలో సీఫెర్ట్‌ను తీసుకునే అవకాశం ఉన్నది. ఇక ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇష్ సోథి దుబాయ్ పిచ్ మీద బాగానే రాణాస్తున్నాడు. మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్ రూపంలో మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. మొత్తానికి కివీస్ జట్టు సమతూకంగా కనిపిస్తున్నది.
బలమైన ఆసీస్..
ఇతర టోర్నీలు, మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలా ఉన్నా.. ఐసీసీ ఈవెంట్స్ అనగానే చెలరేగిపోతారు. ముఖ్యంగా వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియాది తిరుగులేని రికార్డు. వన్డే వరల్డ్ కప్‌ను 5 సార్లు గెలిచిన ఆసీస్ ఖాతాలో ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ టైటిల్ లేదు. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియా ఫామ్ అంతంత మాత్రంగానే ఉన్నది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల్లో సరైన సత్తా చాటలేక పోయింది. సూపర్ 12 దశలోనూ ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. కానీ సెమీఫైనల్‌లో బలమైన పాకిస్తాన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కీలకమైన ఫించ్, స్మిత్, మ్యాక్సీ విఫలమైన సమయంలో లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేసిన పోరాటం ఆశ్చర్యపరిచింది.
ఈ టోర్నీలో వార్నర్ మంచి టచ్‌లో ఉన్నాడు. ఫించ్, స్మిత్ పరుగులు సాధిస్తున్నారు. మ్యాక్స్‌వెల్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావల్సి ఉన్నది. ఇక స్టొయినిస్, వేడ్ సెమీస్ గెలిపించిన తీరు అందరూ చూశారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తూ ఏడో నెంబర్ వరకు అందరూ బ్యాటుతో చెలరేగిపోయేవాళ్లే. భారీ టార్గెట్‌ను కూడా ఛేదించ గలిగే సత్తా ఉన్నది. ఇక బౌలింగ్ విభాగమే కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. జోష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ రాణిస్తున్నారు. అయితే పాట్ కమిన్స్ అంచనాలను అందుకోలేక పోతున్నాడు. ఈ టోర్నీలో అడమ్ జంపా బౌలింగ్‌లో సత్తా చాటాడు. సరైన సమయంలో వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేస్తున్నాడు. స్టొయినిస్ కూడా బంతితో రాణించగలడు. గత మ్యాచ్‌లతో పోలిస్తే మరింత సమర్దవంతంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇక ఫైనల్ జరుగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి పూట మంచు ప్రభావం కారణంగా టాస్ కీలకంగా మారనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ కచ్చితంగా బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపుతాడు. ఇక ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్‌లలో న్యూజీలాండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో కంగుతిన్నది. ఇప్పటికి నాలుగు సార్లు ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో తలపడగా.. అన్ని సార్లూ ఆస్ట్రేలియానే గెలిచింది.
జట్ల అంచనా:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అడమ్ జంపా, జోష్ హాజెల్‌వుడ్
న్యూజీలాండ్: మార్టిన్ గుప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, అడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోథి, ట్రెంట్ బౌల్ట్