దేశానికి దోషం పట్టుకుంది.. యాగం చేస్తున్నాం: స్వరూపానందేంద్ర సరస్వతి

by srinivas |
దేశానికి దోషం పట్టుకుంది.. యాగం చేస్తున్నాం: స్వరూపానందేంద్ర సరస్వతి
X

సాధారణంగా మనుషులకు గ్రహదోషాలు అంటుకుంటాయని జోతిష్యులు చెబుతుంటారు. కానీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం భూగ్రహానికి దోషం అంటుకుందని తెలిపారు. దేశానికి కాలసర్పదోషం ఉందని అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో యాగాన్ని ఆరంభించారు.

ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ధన్వంతరి, మన్యుసూక్త వంటి హోమాలు నిర్వహించనున్నారు. 9 గంటలకు ప్రారంభమైన ధన్వంతరి హోమానికి 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించారు. యాగం నేపథ్యంలో కాళహస్తీశ్వరాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ క్రమంలో యాగం నిర్వహిస్తున్న స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, పాప గ్రహ స్థితి పుంజుకుందని అన్నారు. కరోనా వ్యాపించకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నామన్నారు.

వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి, ఈ యాగాన్ని సామాజిక స్పృహతో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని ఆయన తెలిపారు. రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. శని గ్రహం, కుజు గ్రహం కలయిక వల్ల దేశ, విదేశాల మీద ఆ ప్రభావం ఉందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని ఆయన అన్నారు.

అందుకే అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది సద్బ్రాహ్మలు ఈ క్రతువులో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని వినియోగిస్తున్నామని, ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుందని ఆయన ప్రవచించారు.

tags : sarada peetham, kalahasti temple, swaroopanandendra saraswathi, swatmanandendra saraswathi,

Advertisement

Next Story

Most Viewed