ఘోరం.. నాలుగేళ్ల బాలుడు హత్య.. బాబాయే కాలయముడు..?

by Anukaran |   ( Updated:2021-11-20 09:50:56.0  )
ఘోరం.. నాలుగేళ్ల బాలుడు హత్య.. బాబాయే కాలయముడు..?
X

దిశ , రాజేంద్రనగర్ : మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో శనివారం ఉదయం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా మారింది. నాలుగేళ్ళ బాలుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో నివాసముండే రాజు, మహేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు లక్ష్మీ నరసింహ (4) శనివారం ఉదయం 9 గంటలకు అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు మైలార్ దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

ఇదిలా ఉంటే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా గాంధీ కో ఆపరేటివ్ సొసైటీ లో బాలుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు చనిపోయిన బాలుడు, అదృశ్యమైన బాలుడు ఒక్కడే అని గుర్తించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. అయితే బాలుడి సొంత బాబాయ్ వీరేశ్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed