అంతులేని కలలు.. అంతలోనే విషాదం

by Shyam |   ( Updated:2020-06-14 08:34:36.0  )
అంతులేని కలలు.. అంతలోనే విషాదం
X

నిత్యం కలలు కనే కనులు శాశ్వతంగా నిద్రపోయాయి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునేందుకు తపన పడే హృదయం హఠాత్తుగా ఆగిపోయింది. కాదు.. కాదు.. ఆపేశాడు. తనకు తానే స్వయంగా ఉసురుతీసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఎవరిని అడగాలో తెలియదు.. ఎందుకింత ఒత్తిడికి గురయ్యాడో తెలియదు. పైలట్ అయ్యి ఆకాశాన్ని అందుకోవాలనుకున్న ఆ నిరంతర సాధకుడు.. చివరికి ఆత్మహత్య చేసుకుని అమ్మ దగ్గరికి చేరాడు. చనిపోయిన తల్లి ప్రేమ కోసం తపిస్తూ తన ఒడిలో ఒదిగిపోయాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. పరిచయం అక్కర్లేని పేరు. 21 జనవరి 1986లో పాట్నాలో పుట్టిన సుశాంత్.. బుల్లితెర మీద రాణించి వెండితెరపై తళుక్కున మెరిసిన కథానాయకుడు. సినీ వినీలాకాశంలోకి తారాజువ్వగా దూసుకొచ్చి అంతలోనే నేలరాలిన సినీ తార. కనీసం మాట వరుసకైనా ఇతరులను నొప్పించని ఆ మనసు ఎందుకు నొచ్చుకుందో తెలియదు కానీ.. జరగరానిది జరిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఫేవరెట్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కనుమరుగై పోయాడు. కనిపించనంత దూరతీరాలకు పయనమై పోయాడు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ స్టార్టయినప్పటి నుంచి ఇంటికే పరిమైతమైన సుశాంత్.. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

‘కిస్ దేశ్ మై హై మేరా దిల్’ సీరియల్‌తో మొదలెట్టి..

పవిత్ర రిష్తా సీరియల్‌తో బుల్లితెరపై తనదైన ముద్రవేశాడు. ఈ సీరియల్‌లో లీడ్ రోల్ చేసిన సుశాంత్.. తన నటనతో వెండితెరపై రాణించేందుకు ఎంతో కాలం పట్టలేదు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. చేతన్ భగత్ రచించిన ‘త్రీ మిస్టేక్స్ ఇన్ లైఫ్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సుశాంత్‌కు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ చిత్రంలో పరిణీతి చోప్రాతో రొమాన్స్ చేసి.. యువతుల ఫేవరెట్ అయిపోయాడు సుశాంత్. వెంటనే రాజ్ కుమార్ హిరానీ ‘పీకే’ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసిన సుశాంత్ తన పాత్రకు న్యాయం చేసిన విధానానికి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత డిటెక్టివ్ బ్యొంకేష్ బక్షీ మిస్టరీ థ్రిల్లర్‌లో డిటెక్టివ్‌గా చేసిన సుశాంత్.. వెంటనే మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుశాంత్ రేంజ్ అమాంతం పెరిగింది. వెంటనే కృతి సనన్‌తో ‘రాబ్తా’తో హిట్ అందుకున్న ఆయన.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ వెండితెరకు పరిచయమైన ‘కేదార్ నాథ్’లో జస్ట్ అమేజింగ్ అనిపించాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినా.. సుశాంత్‌ను నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. 2019లో ‘సొంచిరియా’ సినిమాలో కనిపించిన ఈ రాజ్‌పుత్.. చివరగా శ్రద్ధా కపూర్ ‘చిచోరే’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ డైలాగ్ ఒకటుంది. ‘నువ్వు ఫెయిల్ అయ్యావ్ అనేదాన్ని నీ పరీక్షా ఫలితం నిర్ణయించదు.. నీ ప్రయత్నం మాత్రమే డిసైడ్ చేస్తుంది..’అని. కానీ లైఫ్‌లో డిస్టింక్షన్‌లో పాసైనా.. బాధను, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయలేకపోయాడు. ఇలా ఇంతమంది అభిమానులకు తీరని బాధను మిగిల్చి వెళ్ళిపోయాడు.

మొత్తానికి రీల్ లైఫ్‌లో మిస్టర్ కూల్‌గా జీవించిన సుశాంత్.. రియల్ లైఫ్‌లో మాత్రం అంత కూల్‌గా ఉండలేకపోయాడు. ఒత్తిళ్లను తట్టుకోలేక ఇంటర్వెల్ టైమ్‌లోనే లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసేశాడు.

Advertisement

Next Story