వైద్యులను వేధించొద్దు- వాళ్లు కరోనా యోధులు: సుప్రీంకోర్టు

by Shamantha N |
వైద్యులను వేధించొద్దు- వాళ్లు కరోనా యోధులు: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది. హాస్పిటళ్లలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను బహిరంగపర్చిన వైద్యులను సస్పెన్షన్ చేయడంపై ఆగ్రహించింది. వైద్యులను వేధించొద్దని, వారు కరోనా యోధులని తెలిపింది. వాళ్లను రక్షించాల్సిన అవసరమున్నదని సూచించింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్‌లకు చికిత్స, మృతదేహాలతో వ్యవహరిస్తున్న తీరును న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్‌కే కౌల్, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది.

‘వైద్యులను వేధించడం మానుకోండి. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకండి. మీరు నిజాలను దాచిపెట్టలేరు. ఢిల్లీ ప్రభుత్వ నిర్వహణలోని ఓ హాస్పిటల్‌లోని దుర్భర పరిస్థితులను వీడియో తీసిన వైద్యుడిని ఎందుకు సస్పెండ్ చేశారు? వైద్యులను, హెల్త్ వర్కర్లను భయభ్రాంతులకు గురిచేయకండి, వారికి సహకరించండి’ అని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో అఫిడవిట్ దాఖలు చేయండని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. కరోనా పేషెంట్‌లను జాగ్రత్తగా చూసుకోవడానికి, మృతదేహాలతో సరిగ్గా వ్యవహరించడానికి, టెస్టుల సంఖ్య పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

ఈ కేసు కంటే ముందుగా వైద్యులకు సంబంధించిన మరో విషయాన్ని సుప్రీంకోర్టు విచారించింది. కరోనా పేషెంట్‌లకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి వేతనాలు చెల్లించేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యులకూ తప్పకుండా అవసరమైన క్వారంటైన్ వసతులను కల్పించాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed