ఎప్పుడైనా, ఎక్కడైనా ‘నిరసన’ చేస్తామంటే కుదరదు: సుప్రీం

by Shamantha N |   ( Updated:2021-02-13 05:43:09.0  )
supreme court
X

న్యూఢిల్లీ: భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచే, నిరసనలు చేసే హక్కులు కొన్ని బాధ్యతలతో పెనవేసుకుని ఉంటాయని, ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసనలు చేస్తామంటే కుదరదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షహీన్‌బాగ్ నిరసనలు అక్రమమని గతేడాది వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ విచారిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారీల త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘గత తీర్పులను కూలంకషంగా పరిశీలించాం. ఆందోళనలు చేసే హక్కు, భిన్నాభిప్రాయాన్ని వెల్లడించే హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పిస్తున్నది. కానీ, ఆ హక్కులతోపాటు బాధ్యతలూ ఉన్నాయి. నిరసన హక్కును ఎప్పుడైనా, ఎక్కడైనా తెలియజేయడం సాధ్యపడదు. కొన్నిసార్లు ఆకస్మికంగా ఆందోళనలు జరగవచ్చు.

బహిరంగ ప్రాంతాల్లో దీర్ఘకాలం నిరసనలు చేయడం సరికాదు. ఇతరుల హక్కులను ప్రభావితం చేస్తూ పబ్లిక్ ప్లేస్‌లో ఎక్కువ కాలం ఆందోళనలు కూడదు’ అని వివరించింది. ప్రజాందోళనలు నిర్దేశిత ప్రాంతాల్లోనే నిర్వహించాలని పునరుద్ఘాటించింది. అసమ్మతి, ప్రజాస్వామ్యం రెండూ కలిసే సాగుతాయని, షహీన్‌బాగ్‌లాంటి నిరసనలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. పబ్లిక్ ప్లేస్‌లను ఆక్రమించి నిరసనలు చేయడం సరికాదని, అది కూడా నిరవధిక ఆందోళనలు చేయడం ఆమోదయోగ్యం కాదని అక్టోబర్ 7న షహీన్‌బాగ్ ఆందోళనలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా, ఈ తీర్పును సమీక్షించాలని 12 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది.

Advertisement

Next Story

Most Viewed