అదరగొట్టిన హర్మన్ సేన

by Anukaran |
అదరగొట్టిన హర్మన్ సేన
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌లో ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా జరిగిన మ్యాచ్‌లో సూపర్ నోవాస్ విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అనేలా పోటీపడిన హర్మన్, స్మృతి సేనలు.. క్రికెట్ అభిమానులకు ఒక అద్బుతమైన మ్యాచ్ అందించాయి. ఆఖరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూపర్ నోవాస్ విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

జియో ఉమెన్స్ టీ20 చాలెంజ్‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ నోవాస్ జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్‌నోవాస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో ట్రయల్‌బ్లేజర్స్ నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో ట్రయల్‌బ్లేజర్స్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ డాటిన్ (27), మంధాన (33) కలసి తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ధాటిగా ఆడుతున్న డాటిన్ (27) షకీర బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. అయితే డీఆర్ఎస్ తీసుకొని ఉంటే డాటిన్ అవుట్ కాకపోయేదే. రీప్లేలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (4) మరోసారి నిరాశ పరిచింది. అయితే మంధాన (33), దీప్తి శర్మ కలసి ఇన్నింగ్స్ చక్క దిద్దారు. వీరిద్దరూ కలసి 35 పరుగులు జోడించారు. అయితే అనుజ పాటిల్ బౌలింగ్‌లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి మంధాన అవుటయ్యింది. ఆ తర్వాత వచ్చిన హేమలత (4) వెంటనే పెవీలియన్ చేరింది. ఈ సమయంలో దీప్తి శర్మ (43), హార్లిన్ డియోల్(27) ధాటిగా ఆడారు. వీరిద్దరూ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకొని వచ్చారు. వీరిద్దరూ కలసి ఆటను ముగిస్తారని అందరూ భావించారు. కానీ రాధా యాదవ్ వేసిన చివరి ఓవర్లో హర్లీన్.. అనుజ పాటిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. ఆఖరి బంతికి 4 పరుగులు కావల్సిన సమయంలో కేవలం సింగిల్‌కే పరిమితం అయ్యారు. దీంతో సూపర్ నోవాస్ జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రాధా యాదవ్, షకీర చెరో 2 వికెట్లు తీయగా.. అనుజ పాటిల్‌కు ఒక వికెట్ దక్కింది. చామరి ఆటపట్టుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

చితక్కొట్టిన చామరి

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియా పునియా (30), చామరి ఆటపట్టు (67) భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రియ ఆచితూచి ఆడుతూ చామరికి తోడుగా నిలిచింది. మరో ఓపెనర్ చామరి మాత్రం ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్లపై విరుచుక పడింది. ఏ ఒక్క బౌలర్‌ను వదల కుండా సిక్సులు, ఫోర్లు బాదింది. వీరిద్దరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో సల్మా ఖతూన్ బ్రేక్ త్రూ ఇచ్చింది. సల్మా బౌలింగ్‌లో ప్రియ.. దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. వికెట్ పడినా చామరి మాత్రం తన దూకుడును ఆపలేదు. దీంతో 48 బంతుల్లో 4 సిక్స్‌లు, 5 బౌండరీల సాయంతో 67 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న చామరి.. హర్లీన్ డియోల్ బౌలింగ్‌లో హేమలతకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. జమీమా రోడ్రిగ్స్ (1) జులన్ గోస్వామి బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (31) రనౌట్ కావడంతో సూపర్‌నోవాస్ పరుగుల వేగం తగ్గింది. సిరివర్దనే (2), అనుజ పాటిల్ (1) నిరాశపర్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. టీ20 ఉమెన్స్ చాలెంజ్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గోస్వామి, సల్మా ఖతూన్, హర్లీన్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు

సూపర్ నోవాస్

ప్రియా పునియ (సి) దీప్తి శర్మ (బి) సల్మా ఖతూన్ 30, చామరి అటపట్టు (సి) హేమలత (బి) హర్లీన్ డియోల్ 67, హర్మాన్ ప్రీత్ (రనౌట్) 31, జెమీమా రోడ్రిగ్స్ (సి అండ్ బి) 1, సిరివర్దనే (రనౌట్) 2, అనుజ పాటిల్ (రనౌట్) 1, రాధా యాదవ్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లు) 146/6

వికెట్ల పతనం : 1-89, 2-118, 3-122, 4-143, 5-145

బౌలింగ్ : జులన్ గోస్వామి (4-0-17-1), దీప్తి శర్మ (2-0-25-0), సోఫి ఎకిల్‌స్టోన్ (4-0-25-0), రాజేశ్వరి గైక్వాడ్ (2-0-19-0), సల్మా ఖతూన్ (4-0-25-1), హర్లీన్ డియోల్ (4-0-34-1)

ట్రయల్ బ్లేజర్స్

డాటిన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షకీర 27, స్మృతి మంధాన (సి అండ్ బి) అనుజ పాటిల్ 33, రిచా ఘోష్ (బి) షకీర 4, దీప్తి శర్మ 43 నాటౌట్, హేమలత (సి) భాటియ (బి) రాధా యాదవ్ 4, హర్లీన్ డియోల్ (సి) అనుజ పాటిల్ (బి) రాధా యాదవ్ 4, ఎకిల్‌స్టోన్ 0 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లు) 144/5

వికెట్ల పతనం : 1-44, 2-48, 3-83, 4-91, 5-143

బౌలింగ్ : ఖక (2-0-17-0), అనుజ పాటిల్ (4-0-18-1), రాధా యాదవ్ (4-0-30-2), షకీర (4-0-31-2), సిరివర్దనే (3-0-19-0), హర్మన్ ప్రీత్ (2-0-15-0)

Advertisement

Next Story

Most Viewed