ఎట్టకేలకు ఐపీఎల్‌లో మరో గెలుపు నమోదు చేసిన SRH

by Anukaran |
ఎట్టకేలకు ఐపీఎల్‌లో మరో గెలుపు నమోదు చేసిన SRH
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 40వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపు నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో ఇది రెండో విజయం మాత్రమే.. మిగతా 8 మ్యాచుల్లో రైజర్స్ ఓటమి పాలయ్యారు. ఈ సీజన్ 40వ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులతో యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (82) పరుగులతో మెరవగా, యశస్వి జైస్వాల్ (36), మహిపాల్ (29 నాటౌట్) పర్వాలేదనిపించారు.

ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH‌కు ఓపెనర్ జాసన్ రాయ్ మంచి ఊపునిచ్చాడు. 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టాప్‌ ఆర్డర్‌లో వచ్చిన వృద్ధిమాన్ సాహా (18), కేన్ విలియమ్సన్ (51 నాటౌట్‌)గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఇలా ఉంటే ప్రియమ్ గార్గ్ డకౌట్ కాగా.. విలియమ్సన్‌కు తోడుగా అభిషేక్ శర్మ (21 నాటౌట్‌) తన వంతు కృషి చేశాడు. దీంతో 18.3 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 167 పరుగులు చేసి.. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో మరో విజయాన్ని నమోదు చేసుకోవడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story