ఆత్మహత్య బాధిత నేత కార్మిక వితంతు మహిళలు ఢిల్లీకి పయనం

by Shyam |
widowed women
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో నేతన్నలకు , చేనేత రంగానికి , చేనేత వర్గంపై కొనసాగుతున్న వివక్షను ఢిల్లీకి వివరించనున్నట్లు జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేశ్ తెలిపారు. సోమవారం ఆత్మహత్య బాధిత నేత కార్మిక వితంతు మహిళలతో ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు చేనేతపై పలు కార్యక్రమాలను చేపడతామన్నారు.

గడచిన ఏడేళ్లలో 360 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, ఒంటరి మహిళా పెన్షన్లు , పక్కా ఇల్లు, పిల్లల చదువు ప్రభుత్వ బాధ్యత, ఉద్యోగ కల్పన ,హెల్త్ కార్డులు తదితర డిమాండ్ల సాధనకు ఢిల్లీ బాట పట్టామన్నారు. ఆత్మహత్య బాధిత నేత కార్మిక వితంతు మహిళలు మాట్లాడుతూ నిత్యం అనేక సామాజిక ,ఆర్థిక అవమానాలను ఎదుర్కొంటూ ,అనునిత్యం చస్తూ బతకడం ఇక మావల్ల కాదన్నారు.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం తమపై కనీసం కనికరం కూడా చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో నేడు తమ బతుకులు పూట గడవటానికి కూడా కష్టంగా మారిందన్నారు. కార్యక్రమంలో సుంకి సరోజ , శ్యామల సుమతి, కొలను నిర్మల, జెల్ల రేణుక, సింగం సంధ్య, గంజి నాగరాజు, మడత కిషోర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story