డీఎస్సీ వేయ‌క ఉద్యోగం రాలేద‌ని యువ‌కుడి ఆత్మహ‌త్య

by Sumithra |   ( Updated:2021-05-16 09:14:13.0  )
డీఎస్సీ వేయ‌క ఉద్యోగం రాలేద‌ని యువ‌కుడి ఆత్మహ‌త్య
X

దిశ న‌ర్సాపూర్ : వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఎంతో ఆశ‌తో చ‌దువుకున్నప్పటికీ ప్రభుత్వం డీఎస్సీ వేయ‌క‌పోవ‌డంతో త‌న‌కు ఉద్యోగం రాలేద‌ని మ‌న‌స్థాపానికి గురైన ఓ యువ‌కుడు ఆత్మహ‌త్యకు పాల్పడిన సంఘ‌ట‌న మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని వెల్దుర్తి మండ‌లంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. వివ‌రాల్లొకెళితే.. న‌ర్సాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని వెల్దుర్తి మండ‌లంలో శేరిల్లా గ్రామానికి చెందిన కొట్టం శేఖులు-మంగ‌మ్మ దంప‌తులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొద‌టి కుమారుడైన కొట్టం వెంక‌టేష్ (21) టీటీసీ కోచింగ్ తీసుకొని డీఎస్సీ కోసం వేయిట్ చేస్తున్నాడు.

అయితే ప్రభుత్వం డీఎస్సీ వేయ‌క‌పోవ‌డంతో మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. అయితే ఆదివారం నాడు ఉద‌యం తండ్రి కొట్టం శేఖులు త‌ల్లి మంగ‌మ్మ త‌మ్ముడు శ్రీ‌నివాస్‌లు తాత మ‌ల్లయ్యలు పొలానికి వెళ్లారు. ఇదే అద‌నుగా భావించిన వెంక‌టేష్ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో దూలానికి ఉరివేసుకున్నాడు. పొలం నుంచి తిరిగి వ‌చ్చిన కుటుంబీకులు చూసి ఆందోళ‌న చెంది వెంక‌టేష్‌ను కింద‌కు దించి చూడ‌గా అప్పటికే మ‌ర‌ణించిన‌ట్లు తండ్రి శేఖులు తెలిపారు. త‌ర‌చూ త‌మ కుమారుడు ప్రభుత్వం డీఎస్సీ వేయ‌డం లేద‌ని మ‌నోవేద‌న‌కు గుర‌య్యేవాడ‌ని తండ్రి రోదిస్తూ తెలిపాడు. ఈ మేరకు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంక‌టేష్ మ‌ర‌ణంతో గ్రామంలో విషాధ‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

Next Story