కను చూపు మేర మంటలు..ఎస్సై ఎం చేశాడంటే

by Sridhar Babu |
కను చూపు మేర మంటలు..ఎస్సై ఎం చేశాడంటే
X

దిశ, కరీంనగర్:
వరి పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కనుచూపు మేర మొత్తం పొగ, ఎగసి పడుతున్నఅగ్నికీలలు..వాటికి తోడు వేగంగా గాలులు వీచడంతో చూస్తుండగానే ఇతర పొలాల్లోకి మండలు వ్యాపించాయి. వీటిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురాకపోతే పక్కనే రైస్ మిల్లులు, కోళ్ల ఫారాలు కాలి బూడిదవ్వక తప్పదు. అలాంటి సమయంలోనే స్థానిక ఎస్సై చుట్టుపక్కల వారి సాయంతో మంటలను ఆర్పేశారు. తిరిగి స్టేషన్‌కు ప్రయాణమవుతుండగా వేరే పొలాల్లో మంటలు వ్యాపిస్తుండటం గమనించి, తన గన్‌మెన్ సాయంతో చెట్ల కొమ్మలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ శివార్లలోని పంట పొల్లాల్లో గురువారం చోటుచేసుకుంది.
పొలాల్లో మంటలు చెలరేగుతున్నాయని సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ తన గన్‌మెన్ తిరుపతితో కలిసి ఘటనా స్థలికి వెళ్లారు. ఫైర్ ఇంజిన్ కోసం కాల్ చేయగా హన్మంతుని పేటలో జరిగిన అగ్ని ప్రమాదం వద్ద మంటలు ఆర్పుతున్నామని సమాధానం వచ్చింది. దీంతో విధి నిర్వహణలో ఉన్నఎస్సై, గన్‌మెన్‌లు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు సమాయత్తం అయ్యారు. అసలే మండే ఎండలు, వాటికి తోడు ఎగసిపడుతున్న మంటలు.. వీటిని అదుపులోకి తీసుకు రాకపోతే పక్కనే ఉన్న రైస్ మిల్లులు, కోళ్ల ఫారాలు అగ్నికి ఆహుతయ్యేవి.దీంతో ఎస్సై స్థానికులను అప్రమత్తం చేసి పక్కనే ఉన్న బావి నీటి ద్వారా, చెట్ల కొమ్మల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.కారు మబ్బుల్లా కమ్మిన పొగలు, లావాల దహిస్తున్న మంటలను తమ ప్రాణాలకు తెగించి కంట్రోల్ చేసిన సుల్తానాబాద్ ఎస్సై రాజేశ్, గన్‌మెన్ తిరుపతి నాయక్ స్థానికులు, అధికారులు అభినందించారు.

Advertisement

Next Story