ఆధునిక భారతదేశ చరిత్ర: క్విట్ ఇండియా ఉద్యమం(పోటీ పరీక్షల ప్రత్యేకం)

by Harish |
ఆధునిక భారతదేశ చరిత్ర: క్విట్ ఇండియా ఉద్యమం(పోటీ పరీక్షల ప్రత్యేకం)
X

జాతీయోద్యమంలో చిట్టచివరి పోరాటం, అతిపెద్ద ప్రజా పోరాటం అయిన క్విట్ ఇండియా ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు రెండవ ప్రపంచ యుద్ధంతో ముడిపడి ఉన్నాయి.

కారణాలు..

రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాలను సంప్రదించకుండా, గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో భారతదేశం యుద్దంలో భాగస్వామ్యంగా ఉంటుందని ప్రకటిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు.

ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో రాజకీయాల్లో ప్రతిష్టంబన ఏర్పడింది.

ప్రతిష్ఠంబనను తొలగించుటకు గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో 1940 ఆగస్టు 6వ తేదీన చేసిన ఆగస్టు ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది.

యుద్ధానంతరం భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సమితి, అధినివేశ ప్రతిపత్తి వంటి ప్రతిపాదనలకు కాలపరిమితి లేదు కనుక అవి తిరస్కరించబడ్డాయి.

యుద్ధ నిర్వహణ మండలిలో కీలకమైన రక్షణ శాఖను ఇవ్వకుండా ఇతర శాఖలను ఇవ్వడం అర్ధరహితమని కాంగ్రెస్ భావించింది.

రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వక పోవడం పట్ల అసంతృప్తికి గురైన గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు.

1942 మార్చిలో వచ్చిన క్రిప్స్ రాయబారం కూడా భారతీయ నాయకత్వాన్ని నిరుత్సాహపరిచింది.

క్రిప్ కేవలం 1940 ఆగస్టు ప్రతిపాదనలను పునరుద్ఘాటిస్తూ భారతదేశంలోని ప్రతి జాతికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ఉందని ప్రకటించడం కాంగ్రెస్‌ను నిరాశ పరిచింది.

క్రిప్స్ ప్రతిపాదనలను దివాలాకోరు బ్యాంక్ ఇచ్చిన చెక్కుల వంటివి అని గాంధీ విమర్శించాడు.

భారతీయుల సమస్యల పట్ల బ్రిటిష్ వారికి చిత్తశుద్ధి లేదని గ్రహించాడు.

నానాటికి విస్తరిస్తున్న జపాన్ సామ్రాజ్యవాదం కాంగ్రెస్‌ను కలవర పెట్టింది.

ఆసియా ఆసియా వాసులకే అనే నినాదంతో జపాన్ ఆసియాలోని ఇంగ్లాండ్ వలస లన్నింటిని ఆక్రమించింది.

జపాన్ బారి నుండి భారతదేశాన్ని కాపాడలేని ఇంగ్లాండ్ తాను ఓడిపోయిన ప్రాంతాల్లో స్వచ్ఛందంగా భారతీయ సైన్యాలను జపాన్‌కి స్వాధీన పరచడం కూడా నాయకత్వ ఆందోళనకు కారణమైంది.

రెండవ ప్రపంచ యుద్ధం ఒక సాకుగా అధికార రహస్యాల చట్టాన్ని ప్రవేశపెట్టడం, ప్రజా హక్కులు రద్దు చేయడం ఉద్యమానికి కారణాలయ్యాయి. యుద్ధ ప్రభావం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం, భారతీయ సైన్యాలను వివక్షతకు గురిచేయడం.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అనివార్యం చేశాయి.

Advertisement

Next Story