గోడలే బ్లాక్ బోర్డులు!

by Anukaran |   ( Updated:2020-10-30 06:01:00.0  )
గోడలే బ్లాక్ బోర్డులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోతే, పిల్లలు మాత్రం జ్ఞానం పరంగా నష్టపోయారు. ఎన్ని తెలివితేటలు ఉన్నా, చెప్పే టీచర్ లేకపోతే ఆ జ్ఞానం ఎక్కువ కాలం ఉండదు. అలాగని ఆన్‌లైన్ పాఠాలు అందరికీ అందుబాటులో ఉంటాయా అంటే అదీ లేదు. దీంతో పేద దేశాల్లోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇంటర్నెట్ సరిగా ఉండని ఫిలిప్పీన్స్ దేశంలో మెసెంజర్ చదువుల గురించి ఇటీవల తెలుసుకున్నాం. అయితే, కరోనా పాండమిక్ సమయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి విభిన్న మార్గాలు ఎంచుకుంటున్న టీచర్ల గురించి వింటూనే ఉన్నాం. ఒకరు విద్యార్థుల ఇంటికే వెళ్లి పాఠాలు చెప్తే, మరొకరు ఏకంగా తన బండినే పాఠశాల మార్చి పాఠాలు చెప్పారు. జమైకాకు చెందిన టనేకా మెక్‌కాయ్ అనే స్కూల్ టీచర్ కూడా సరిగ్గా అలాంటి పనే చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఇక్కడ తెలుసుకుందాం..

వీధి గోడలను బ్లాక్ బోర్డులుగా మలిచి పిల్లలకు పాఠాలు చెబుతోంది. ప్రారంభంలో జమైకా వీధుల్లో మంచి గోడలను ఎంచుకుని వాటికి నలుపు రంగు పెయింటింగ్ వేసి, బ్లాక్ బోర్డ్‌లుగా మార్చింది. ఇక అప్పట్నుంచి రోజూ పొద్దున్నే 8 గంటల నుంచి మొదలు పెట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ బ్లాక్‌ బోర్డుల దగ్గర స్థానిక పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఆమె ఐడియా మెచ్చుకుని ఇతర టీచర్లు కూడా వాళ్ల వీధుల్లో గోడలను బ్లాక్ బోర్డ్‌లుగా మార్చి పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా 120 మందికి పాఠాలు చెబుతున్నట్లు టనేకా తెలిపింది. చేయాలన్న సంకల్పం ఉంటే ఎలాగైనా లక్ష్యాన్ని సాధించొచ్చని టనేకా చేసిన పనితో మరోసారి నిరూపితమైంది.

Advertisement

Next Story