ఉస్మానియాలో విచిత్రమైన పరిస్థితి

by Shyam |   ( Updated:2021-09-23 12:09:22.0  )
ఉస్మానియాలో విచిత్రమైన పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో మూడు రోజుల్లో స్కూల్​ ఆఫ్​ నర్సింగ్​లకు ప్రత్యక్ష తరగతులు షురూ కానున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆన్​లైన్​ క్లాస్​లకు పరిమితమైన విద్యార్ధులు సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా రావాలని డీఎంఈ డా. రమేష్​రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల మధ్య సమన్వయంతో నర్సింగ్​ విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇన్నాళ్లు విద్యార్ధులెవ్వరూ క్లాస్​లు, హాస్టళ్లలో లేనందున వరంగల్​ ఎంజీఎం, గాంధీ, ఉస్మానియా స్కూల్స్​లో గదులన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి.

శానిటేషన్​, విద్యుత్, వాటర్ ​వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. నల్లాలు లీకేజ్​, శుభ్రత లేని బాత్​ రూంలు, తరగతి గదుల్లో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అంతేగాక కొన్ని చోట్ల డోర్లు, కిటికీలు కూడా పాడైపోయాయి. స్కూళ్ల ప్రారంభానికి కేవలం మూడు రోజుల కాల వ్యవధి ఉండటంతో నర్సింగ్​ టీచర్లు ఆగమేఘాల మీద క్లీనింగ్​ చేయించుకుంటున్నారు. గాంధీ, ఎంజీఎంలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉస్మానియాలో అతి దారుణంగా ఉంది. గతంలో స్కూల్​ ఆఫ్​ నర్సింగ్​ కి కేటాయించిన బిల్డింగ్​ లో ప్రస్తుతం సూపరింటెండెంట్​తో పాటు అతని పేషీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో జీఎన్​ఎం విద్యార్ధులు వస్తే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు బిల్డింగ్​ కొరకు సూపరింటెండెంట్​ ను అడగ్గా, జీఎన్​ఎంను ఉస్మానియా నుంచి తరలించేస్తే బెటర్​ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో విద్యార్ధులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమకు కేటాయించిన బిల్డింగ్​ లో సూపరింటెండెంట్​ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఉస్మానియాలో 180 విద్యార్ధులు

జీఎన్​ఎం మూడు సంవత్సరాల కోర్సులో ఉస్మానియా నర్సింగ్​ స్కూల్​ లో ప్రతీ ఏటా 180 మంది విద్యార్ధులు శిక్షణ పూర్తి చేసుకుంటారు. ప్రస్తుతం మూడో సంవత్సరానికి చెందిన 45 మంది విద్యార్ధులు క్లినికల్స్​ కొరకు ఇప్పటికే హాస్టళ్లకు చేరుకోగా.. మొదటి, రెండవ సంవత్సరాలకు చెందిన స్టుడెంట్లు మరో మూడు రోజుల్లో చేరుకుంటారు. కానీ ఇప్పటి జీఎన్​ఎం విద్యార్ధులకు బిల్డింగ్​ కేటాయించలేదు. దీంతో ఒకవేళ విద్యార్ధులు వస్తే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇటు ప్రభుత్వం, మరోవైపు సూపరింటెంటెంట్​ స్పందించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక నర్సింగ్​ ఫ్యాకల్టీ కూడా తలలు పట్టుకుంటున్నారు.

ఇండెంట్​ పెట్టాలే..

పాడైన నల్లాలు, లైట్లు, వాష్​ రూం సామాగ్రీ, టేబుల్స్​, తదితర వస్తువుల కొరకు ఇండెంట్​ పెట్టాలని సూపరింటెండెంట్​ చెబుతున్నారని నర్సింగ్​ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇండెంట్​ పెడితే అవి ఆరు నెలలకు వస్తాయని పేర్కొంటున్నారు. కానీ మూడు రోజుల్లో తరగతులు ఎలా నిర్వహించాలో తమకు అర్థం కావడం లేదని ఓ అధికారిణీ దిశకు చెప్పారు.

Advertisement

Next Story