తొలి తెలుగుకు ప్రాణం పోసింది తెలంగాణే..!

by Shyam |
తొలి తెలుగుకు ప్రాణం పోసింది తెలంగాణే..!
X

ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పేరొందిన తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల్లో రెండో సరళమైన భాషగా పేరుగాంచింది. తేనెలోలుకు తెలుగుకు ప్రాణం పోసి, ప్రాచీన హోదా కల్పించింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం. వేయి సంవత్సరాలకు క్రితం జైనమతా క్షేత్రంగా వెలుగొందిన కురిక్యాలలో జైనమతం విరాజిల్లిన కాలానికి సంబంధించిన శిలాశాసనం నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

దేశీయ కవిత్వానికి, కంద పద్యానికి ప్రాచీన మూలాలు తొలుత తెలంగాణాలోనే లభ్యమయ్యాయి. కన్నడ సాహిత్యంలో ఆదికవిగా ప్రాచుర్యం పొందిన వేములవాడ చాణక్య రాజుల ఆస్థాన కవి పంపన తెలుగులోను నాలుగు కావ్యాలు వ్రాసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. తెలుగులో ఆది కవిగా ప్రాచుర్యం పొందిన నన్నయ్య 11శతాబ్దానికి చెందినవాడు కాగా, కురిక్యాల శాసనాన్ని లిఖించిన మహా కవి పంపన క్రి.శ 902 నుండి 975 మధ్యకాలంలో జన్మించినట్టు తెలుస్తోంది. కన్నడ, సంస్కృత భాషల్లో కావ్య రచన చేసిన పంప మహాకవి తెలుగు భాషకు ఎనలేని సేవచేశాడు. ఆది కవి నన్నయ్యకు పూర్వం ఉన్న కవిత్వానికి సంభందించిన ఆధారాలను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల బొమ్మలమ్మ గుట్టలో లభ్యమయ్యాయి. 10 వ శతాబ్దానికి చెందిన శాసనంలో లభించిన కంద పద్యం ఆధారంగా తెలుగు భాషకు ప్రాచీనహోదా కల్పించారు.

జైన రాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని సాపదలక్ష (ఉత్తర తెలంగాణ) ప్రాంతాన్ని క్రీ.శ.750-973 మధ్య కాలంలో పాలించారు. ఆ సమయంలో కురిక్యాల శివారులోని బొమ్మలమ్మ గుట్ట ఒక పెద్ద జైనమత విద్యా, సాహిత్య క్షేత్రంగా వెలుగొందింది. అప్పుడే సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల సాహిత్య సంగమంగా ఈ ప్రదేశం పేరుపొందింది. క్రీ.శ.945లో జీనవల్లభుడు, బొమ్మలమ్మ గుట్టపై నిలిచి ఉన్న సమతల సిద్ధశిలపై జైనుల దేవత చక్రేశ్వరిని, ఆమె పైభాగాన ఆది, అంత్య తీర్థంకరులైన వృషభనాథుడు, వర్థమాన మహావీరుడి విగ్రహాలను ఆకర్షణీయంగా చెక్కించాడు. అష్టభుజాలు కలిగిన చక్రేశ్వరీ దేవి, వివిధ ఆయుధాలు, ఆభరణాలతో గరుడవాహనంపై కొలువుదీరగా, ఆమెకిరువైపులా ముగ్గురి చొప్పున ఆరుగురు జైన దిగంబరులున్నారు. ఇక చక్రేశ్వరి భుజాలకు ఇరువైపులా ఆమె సేవకులుగా భావించే స్త్రీ రూపాలు చెక్కి ఉన్నాయి. జీన వల్లభుడు, త్రిభువన తిలక మనే జైనబసది, మదనవిలాస మనే తోటను గుట్టపై ఏర్పాటు చేసి.. కింద ‘కవితాగుణార్ణవం’ అనే చెరువును తవ్వించాడు.

కురిక్యాల గుట్టపైన 11 వరుసల కందపద్యాలే తెలుగులో మొట్టమొదటి కంద పద్యాలని రుజువైంది. ఈ నేపథ్యంలో కురిక్యాల గ్రామంలోని శాసనం యోక్క చారిత్రిక ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంంటే బావుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే.. భావితరాలకు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖతను వివరించినవాళ్లమవుతామని స్థానికులు ఆశపడుతున్నారు. గూట్టపైన గల జైనమత క్షేత్రం వద్దకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, అక్కడికి మెట్ల దారిన ఏర్పాటు చేయాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. శతాబ్దాలు గడిచినా చెరగని చరిత్రను కాపాడేందుకు. జైనులు ఏర్పాటు చేసి శాసనాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ప్రాంతాలు, రాజ్యలు, దేశాలు, చివరకు కుటుంబాలు కూడా విడిపోయిన ఘటనలున్నప్పటికీ భాష విడిపోయిన ఘటనలు మాత్రం అరుదే.. పాళీ భాష మాత్రం కనుమరుగైపోయింది. ఈ భాష నుంచే తెలుగు, కన్నడ బాషలు ఉద్భవించాయని చరిత్ర చెబుతోంది. కురిక్యాల గుట్టపై ఉన్న ఆనవాళ్లు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. జైనుల కాలంలో వాడుకలో ఉన్న పాళీ భాషతో పాటు మిలితమైన భాష నుండి వేర్వేరుగా విడిపోయిన ఆనవాళ్లు కూడా బొమ్మలమ్మ గుట్లపై లభ్యమయ్యాయి. మహా కవి పంపన హయాంలోనే పాళీ భాష కన్నడ, తెలుగు భాషలుగా విడిపోయినట్టు ఇక్కడ లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed