స్థానిక సమరం పై కాంగ్రెస్ ఫోకస్..!

by Sumithra |
స్థానిక సమరం పై కాంగ్రెస్ ఫోకస్..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు.. ఉమ్మడి జిల్లా పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటినట్లుగా.. స్థానిక సంస్థల ఎన్నికలలోను సత్తా చాటేలా దూకుడు పెంచుతోంది. ఒకవైపు అధికారిక కార్యక్రమాలు మరోవైపు కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు.. ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలను ప్రధాన అస్త్రంగా చేసి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం లేకుండా చేసి.. బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా.. వ్యూహాల రచనలు చేస్తూ అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేసి.. త్వరలోనే మరికొన్నింటిని అమలు చేసేందుకు అధికార పార్టీ సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో గాని, మార్చి మొదటి వారంలో గాని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార పార్టీ మరింత పట్టు సాధించేలా కార్యక్రమాలలో జోరు పెంచారు. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు జిల్లాస్థాయిలో ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కోలుకోని బీఆర్ఎస్..

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కోలుకోలేదన్నది రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం ఓటమి పాలైన మాజీలు వారి వారి నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయిలో పర్యటనలు చేయకపోవడం.. నాయకులు కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తితే పట్టించుకునే పరిస్థితిలు లేకపోవడంతో ఆ పార్టీ ఇంకా ఓటమి బాధ నుంచి తేరుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది మాజీలైతై కార్యక్రమాలను కూడా ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళ లేకపోతున్నారు.

వికసించని కమలం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి మినహాయించి మిగతా చోట్ల చెప్పుకోదగిన స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు సాధించలేకపోయారు. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. అధికార పార్టీ నేతల ఎత్తుగడలను అధిగమించి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డీకే అరుణ ఎంపీగా గెలిచిన విషయం పాఠకులకు విధితమే.. ఆమె గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో కార్యకర్తలు నాయకులలో కొంత ఉత్సాహం పెరిగినా.. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేదిగా ఉండడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సైతం పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. సీనియర్ నేతలు ఎవరు కూడా ప్రభుత్వం పైన కానీ, పార్టీ కార్యక్రమాలను గురించి గానీ మాట్లాడలేకపోతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుగంటి భరత్ ఓటమి తర్వాత క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు.

కొల్లాపూర్, గద్వాల్ కల్వకుర్తి నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలలో చెప్పుకోదగిన స్థాయిలో నాయకులు లేరు. పార్టీ ముఖ్యనాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లా పై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతే ప్రజల్లోకి వెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తే తప్ప ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. లేదంటే ఆ పార్టీ పరిస్థితులు పూర్తిగా దెబ్బతింటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో అప్పటిలోపు రాజకీయ పార్టీల పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed