- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒట్టు, బొట్టు బొట్టులో హానెస్‘టీ’!
వాటర్ ప్లాంట్లు వర్సెస్ టి(తెలంగాణ) మిషన్ భగీరథ! మావంటే.. మావే మంచి నీళ్లంటూ పోటాపోటీ పబ్లిసిటీ. ఒకరేమో కస్టమర్లతో మౌత్ టు మౌత్, మరొకరేమో ఓపెన్‌గా! భగీరథకు సపోర్టుగా ప్రచారం చేసేది ఎవరయ్యా అంటే, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే. తెలంగాణ రాష్ట్రంలో తాగు నీటి వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంటున్నది. ఖర్మ కొద్దీ మన స్టేట్ అంతా (ఇపుడంటే కాళేశ్వరం ప్రాజెక్టులొస్తున్నాయి) పాతాళం నీటిపైనే ఆధారపడింది. బోర్ వాటర్‌లో బొచ్చెడు ఫ్లోరైడ్. ఆరోగ్యానికి హానికరం. పైగా ఫుల్ డ్రాట్. సరిగ్గా ఆ పరిణామమే ఊరూరా వాటర్ ప్లాంట్లు వెలిసేందుకు బీజమేసింది. టౌన్లు, సిటీల్లోనైతే గల్లీకొకటి, వాడకోటి అన్నట్టుగా అందుబాటులోకి వచ్చాయి. ఆరున్నర ఇంచుల బోర్లు తవ్వించుడూ, ఆర్‌వోలు అమర్చుడు కామనైంది. గడిచిన ట్వంటీ ఇయర్సులో ఈ దందా పుట్టగొడుగల్లా మార్కెట్‌పై పడింది. ఏకంగా నీటి శుద్ధి(ఆర్‌వో) మెషిన్ల ఫ్యాక్టరీలు హైదరాబాద్‌లో సెటిలయ్యాయి. విద్యా వ్యాపారం తర్వాత అదో పెద్ద బిజినెసైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలూ నీటి కొనుగోళ్లకు అలవాటు పడ్డాయి. 20 లీటర్లుండే ఒక్కో బబుల్ రేటు రూ.10తో మొదలై రూ.30 దాకా ఎగబాకింది. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే శుద్ధి చేసిన(?) నీటిని మొబైల్ ట్యాంకుల్లో ఇంటింటికీ అమ్మే పనిలో పడ్డారు. నీటి అమ్మకం సమాజాన్ని అంతలా క్యాప్చర్ చేసేసింది. దూరదృష్టి, జనం బాధలు పట్టని ప్రభుత్వాల వైఫల్యమూ నేపథ్యమైంది.
ఇక ఆ నీటి దందా పప్పులుడకవా..?
తెలంగాణలో ఘర్ ఘర్‌కూ కుళాయి నీటిని అందించే స్కీమ్ పేరు మిషన్ భగీరథ. దానిని ఎఫెక్టివ్‌గా అమలు చేయాలంటే, వాటర్ ప్లాంట్ల పని పట్టాలని పాలకులు యోచిస్తున్నారట. ఉన్నత స్థాయి రివ్యూలోనూ ఇటీవల డిస్కస్ చేశారు. అనుమతుల్లేని, ప్రమాణాలు పాటించని బాపతువి క్లోజ్ చేయాలని యోచిస్తున్నారు. భూగర్భ జలాధారిత నీటిలో తగిన పోషకాలుండవని పరిశోధనలు చెబుతున్నాయి. పైగా హానికర ఫ్లోరైడ్, గుండె, మూత్ర పిండాలకు ఎసరుపెట్టే సోడియం, చర్మ వ్యాధులు, ఉదరకోశ ఇబ్బందులకు దారితీసే రసాయనాలు గ్రౌండ్ వాటర్‌లో కలిసి ఉంటాయి. ఆ నీటినే శుద్ధి చేసి క్యాన్లలో పోసి అమ్ముతుంటారని, ఆ నీళ్లు సురక్షితం కావంటూ తాగునీటి శాఖ రెండేళ్ల కిందటే అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. మొక్కుబడిగా కాకుండా, శ్రద్ధ పెట్టి జనం దృష్టిని మిషన్ భగీరథ వైపు మళ్లించాలని సర్కారు డిసైడైంది. రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్ల నీటిని శుద్ధి చేసి, హౌస్ టు హౌస్ సరఫరా చేపడుతోంది. నల్లాల్లోకి వచ్చేదంతా ఉపరితల జలం కావడంతో పోషకాలు మెండుగా ఉంటాయని ప్రచారం చేస్తున్నది. అట్లా టాం టాం చేయడమే కాదు, స్వయంగా తామూ భగీరథ నీళ్లను తాగుతూ ప్రజల్లో నమ్మకం, గౌరవం పెంచాలని హయ్యర్ ఆఫీసర్లకు సర్కార్ ఆర్డరేసిందట. అంతెందుకూ? మునిసిపల్ మినిస్టర్ కేటీఆర్ అక్కడక్కడా భగీరథ వాటరునే బహిరంగంగా తాగుతూ ప్రోత్సహిస్తున్నారు. భగీరథను ఒక రకంగా ప్రమోట్ చేస్తున్నారు. సిరిసిల్లలో గత ఫిబ్రవరి 20న జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో కేటీఆర్ మిషన్ భగీరథ నీటిని తాగారు. మరో వంక వాటర్ ప్లాంట్ల నియంత్రణకు ఆయా విభాగాలు పూనుకుంటున్నాయి. ఎక్కడికక్కడ వాటి జాతకాలను పేపర్‌పై పెట్టిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్టుగా, వాటర్ ప్లాంట్ల హవాను డౌన్ చేస్తే, ఆటోమెటిగ్గా మిషన్ భగీరథను జనం ఆదరిస్తారన్నది ప్లానట. వాటర్ ప్లాంట్లపై కోపానికి మరో కారణమూ ఉందట. ‘భగీరథ నీళ్లు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, వాటిల్లో ఏవేవో కలుస్తాయి, తాగటానికి మంచివి కావ’ని కొన్నిచోట్ల ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు జనానికి నూరి పోస్తున్నారని సర్కారుకు ఉప్పందింది. వాటిపై అగ్గిమీద గుగ్గిలమవడానికి ఆ సమాచారమూ హేతువైంది. వన్స్ ఒకసారి మిషన్ భగీరథ పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించాక, అవసరమైతే ప్లాంట్లను బ్యాన్ చేయాలనీ తలుస్తున్నారట.
కేసీఆర్ సంచలన ప్రామిస్..యాదికున్నదా?
గడప గడపకూ నల్లా నీరు అందించకపోతే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని కేసీఆర్ 2014లోనే ప్రామిస్ చేశారు. అది రాజకీయంగా పెను సంచలనమైంది. ఆ ప్రతిన సాహసోపేతమైనదని టీఆర్ఎస్ చెప్పుకొన్నది. మరోసారి ఎలక్షన్లూ జరిగాయి. టీఆర్ఎస్ ఓట్లూ అడిగింది. మళ్లీ ఆ పార్టీనే గెలిచింది. కానీ, రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఇంటింటికీ తాగు నీరందంచే పథకం మిషన్ భగీరథ మాత్రం నేటికీ కంప్లీట్ అవలేదు. పీఎం మోడీ, నాటి సెంట్రల్ మినిస్టర్, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో కలిసి తన సెగ్మెంట్ గజ్వేల్‌లో 2016 ఆగస్టు 7న ఈ స్కీమ్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభింపజేశారు. బటన్ నొక్కి పైలాన్ ఆవిష్కరించి, నల్లా తిప్పి పీఎం మోడీ బిందెలో నీటిని నింపారు. క్షేత్రంలో పరిశీలిస్తే, అనేకచోట్ల ఆ వ్యవస్థ పనులు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. మచ్చుకు..నల్గొండలో ఇంటింటికీ నల్లా కోసం తీరిగ్గా గడిచిన నెలలో కందకాలు తవ్వి పైపులేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో 2.40 లక్షల ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 93 వేల హౌసెస్‌కే ఇచ్చారు. 706 ట్యాంకులకు గాను 573 ట్యాంకులకే నీరు చేరుతోంది. పెద్దపల్లి టౌన్‌లో అంతర్గత పనులను కాంట్రాక్టరు సడెన్‌గా ఆపేశారు. జగిత్యాల జిల్లాలో నూరు ఆవాసాలకు నో నీరు. మంచిర్యాల జిల్లాలో జెస్ట్ 60 శాతం పనులే జరిగాయి. 2 లక్షల కనెక్షన్లకు గాను 50 వేలలోపే ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో 80 శాతం పనులు పూర్తయినా, కొన్నిచోట్ల అంగడి అంగడిగానే ఉన్నాయి. నిజానికి 2017లోనే భగీరథ పూర్తి చేయాలని కేసీఆర్ గట్టిగా ఆదేశించారు. ఆ వాయిదాలు దాటీ దాటీ..ఈ నెల 31 వరకు మరోసారి పొడిగించారు. స్టేట్‌లో మినిమమ్ 90 పర్సెంట్ పనులు జరిగాయని ఆఫీసర్లు అంటున్నారు. చిన్న చిన్న పనులే మిగిలాయంటారు. అవి ఎప్పుడు పూర్తవుతాయనే దానిపై మాత్రం నమ్మకం కలిగించరు.
రెంటికీ చెడ్డ రేవడయితే కాదు కదా!
సర్కారు వారి వాయిదాల లిస్టులో భగీరథ కూడా ఒకటి. నూటికి నూరు శాతం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ? మరో వంక వాటర్ ప్లాంట్ల భరతం పట్టాలని నడుం బిగిస్తున్నారు. ఇటు భగీరథ నీరందక, అటు వాటర్ ప్లాంట్ల సేవలూ దొరక్క పబ్లిక్ రెంటికీ చెడ్డ రేవడయితే కారు కదా! దీనిపై జనానికి ప్రభుత్వమే కచ్చితమైన భరోసా ఇవ్వగలగాలి. భగీరథలో తలసరి నీటి సరఫరా లక్ష్యం ఎట్లా ఉందంటే..గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల వాటర్ అందిస్తారు. చివరగా, చిన్నమాట! మనం బస్టాండ్లు, షాపులు, ఆడా ఈడా కొనుక్కొనే కార్పొరేటు కంపెనీల లీటర్ బాటిల్ రేటెంత? రూ.20 నుంచి రూ.25 దాకా ఇచ్చి కొంటున్నాం కదా! సరిగ్గా ఆ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లనే కేరళ ప్రభుత్వం ఏకంగా రూ.13కి తగ్గింపజేసింది. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ గత నెలలో దీనిపై డేరింగ్ డ్యాషింగ్ ఆర్డరేశారు. ఆ కంపెనీలు లబోదిబో‘మనీ’, కోర్టుకెళతామని గాయి గాయి చేసినా ఆయన మాత్రం డోంట్ కేర్ అన్నారు. పైగా, ఒక్కో నీళ్ల సీసా తయారీకి రూ.6, ట్రాన్స్‌పోర్టుకు రూ.2 కలిపి టోటల్‌గా రూ.8దే అవుతుందని తేల్చారు. ఒక్కో బాటిల్‌పై రూ.5 బెనిఫిట్ చాలదా? అంటూ ఘాటైన కౌంటరిచ్చారు. మరి మన కాడ దేశంలోనే మన నంబర్ వన్ సీఎం అట్లా చేయగలరా? చాల్ చాల్లే..ఈ వేసవిలో సిటీలో నీటి ఎద్దడి రాకుండా చూస్తే చాలు, ఆ బహుళజాతి కూల్ డ్రింకు కంపెనీలకు వాటర్ సప్లయ్‌ని వర్షాలు పడేదాకా ఆపితే చాలంటారా!