బ్యాచ్‌మేట్లే బాసులు.. పోలీసులకే అన్యాయమా?

by Sridhar Babu |   ( Updated:2020-03-17 02:39:35.0  )
బ్యాచ్‌మేట్లే బాసులు.. పోలీసులకే అన్యాయమా?
X

దిశ, కరీంనగర్: టాటా అని చెప్పిన మరుక్షణమే ఆ ఎస్సై గుండెలపై ఢాం ఢాం అంటూ తూటాల వర్షం కురిసింది. అంతలోనే నేలకొరిగాడు వర్దన్నపేట ఎస్సై రఘు.

ప్రొబెషనరీ పూర్తయి తనకో స్టేషన్ అప్పగించారన్న సంతోషం ఆయనకు మిగలలేదు… ఆయన కుటుంబ సభ్యులూ ఆస్వాదించుకోలేదు. విధుల్లో చేరిన 48 గంటల్లోనే పీపుల్స్ వార్ మందుపాతరలో నుజ్జనుజ్జయి పోయాడు చందుర్తి ఎస్సై శ్రీనివాస్.

రిటైర్డ్ అయిన తరువాత కుటంబ సభ్యులతోనే గడపాలని కలలు కంటున్న ఆ ఎస్సై అడవుల్లో జరిగిన పేలుడుకు అసువులు బాసాడు. పంజాబ్ కమెండోలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌పై వార్ వేసిన పంజాలో చివరి శ్వాస విడిచాడు మహదేవపూర్ ఎస్సై వెంకటస్వామి.

ఇలాంటి యుద్ధవాతావరణంలో కొనసాగిన ఆనాటి పోలీసు ఉద్యోగంలో చేరినోళ్లకు పిల్లనిచ్చేందుకు కూడా వెనకడుగు వేసేవారు. అయినా వాళ్లకున్న క్రేజీ ఆటుగా అడుగులు వేయించింది. ఎప్పుడు ఏ రూపంలో చావు మూడుతుందో తెలియని పరిస్థితి. క్షేమంగా ఇంటికి వస్తే చాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే వారు. ఇంటికి చేరిన బిడ్డను చూసి తల్లిదండ్రులు తన్మయత్వంలో మునిగితేలితే, కుటుంబ సభ్యులు వారి జీవితంలో ఓ రోజు గడిచిపోయిందన్న సంతోషం వ్యక్తం అయ్యేది. రెండు దశాబ్దాల క్రితం వరంగల్ జోన్ లోని పోలీసుల జీవన దుస్థితి ఇది. భూ స్వామ్య వ్యతిరేక నినాదం, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన అన్నలతో పోలీసులకు డైరెక్ట్ వార్ నడిచింది. ఆ నాటి భయానక పరిస్థితులు ఎదుర్కొన్నది 2002 బ్యాచ్ ఎస్సైల వరకే. అందులో 1995, 1996 బ్యాచ్ లకు చెందిన వారయితే మృత్యువుతో సహవాసం చేశారనే చెప్పాలి.

ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొని యూనిఫాం వేసుకున్న పోలీసులు శాఖాపరంగా కూడా వివక్షకు గురయ్యారు. ప్రాణాలకు గ్యారెంటీలేని ఉద్యోగం వెలగబెట్టిన వారికి పదోన్నతులంటేనే తెలియదు. 1989 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన నియామకం విధానం 1991 నుండి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ప్రారంభం అయింది. అప్పటి నుండే పోలీసు విభాగంలో చేరేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే పోలీసు మాన్యువల్ ప్రకారం ప్రతి ఆరేళ్ల కోసారి పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమోషన్ విధానం విషయంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఏర్పడిన జోన్ల విధానం ద్వారా తీరని అన్యాయం జరిగింది. వరంగల్ జోన్ పరిధిలోని పోలీసులు దశాబ్దన్నర కాలం వరకూ ప్రమోషన్లకు నోచుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం వరంగల్ జోన్ పరిధిలో పీపుల్స్ వార్ కార్యకలాపాలే కారణం. 1991 వరకు పోలీసు‌శాఖలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ర్యాంకర్లు కావడంతో నక్సల్స్ ఏరివేత సాధ్యం కాలేదు. దీంతో డైరెక్ట్ రిక్రూట్ అయిన పోలీసు అధికారులు యవకులు కావడంతో కూంబింగ్ చేపట్టడానికి ఉపయోగపడేవారు. ఈ సమయంలో వీరికి పదోన్నతి కల్పిస్తే నక్సల్స్ ఏరివేత సమస్యగా మారిపోతుందని భావించిన అప్పటి అధికారులు పదోన్నతుల ప్రక్రియను నిలిపివేశారు.

వరంగల్ జోన్‌లో పోస్టింగ్ కావడం వీరికి ఓ రకంగా శాపంగా మారితే ఇక్కడి అడవులను కంచుకోటగా మార్చుకున్న నక్సల్స్ వల్ల అటు ప్రాణాలకు ఇటు పదోన్నతులకు గ్యారెంటీ లేకుండా పోయింది. తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించే వారికి శాఖాపరంగా పదోన్నతులు కల్పించేందుకు సాహసించని అప్పటి ఉన్నతాధికారుల నిర్ణయం వరంగల్ జోన్ ఎస్సైలకు అన్నింటా అన్యాయామే జరిగింది. దీంతో దర్జాగా ఉద్యోగం చేసుకుని కాలికి మట్టి అంటకుంటా విధులు నిర్వర్తించిన హైదరాబాద్ జోన్ పోలీసు అధికారులు చకాచకా ప్రమోషన్లు పొందితే వరంగల్ జోన్ ఎస్సైలు 15 ఏళ్లయినా మూడు చుక్కల ముచ్చట తీర్చుకోలేకపోయారు.

బ్యాచ్‌మేట్లే బాసులు

రాష్ట్ర పోలీసు వ్యవస్థలో పదోన్నతుల విధానం జోన్ల వారీగా చేసిన తరువాత వరంగల్ జోన్ పోలీసు అధికారుల ధైన్యం అత్యంత దయనీయం. సీఐలుగా పదోన్నతి పొందేవరకు జోన్ల వరకే బదిలీల ప్రక్రియ ఉండగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్.డి.పి.ఓ.) లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ) పదోన్నతి పొందిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు ఉంటాయి. దీంతో వరంగల్ జోన్ 1995 బ్యాచ్ కు చెందిన ఎస్సైలు ప్రస్తుతం సీఐలుగా ఇదే జోన్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ జోన్‌కు చెందిన ఇదే బ్యాచ్ ఎస్సైలు ఇప్పుడు ఏసీపీలుగా ప్రమోషన్ పొంది బ్యాచ్ మెంట్లకే బాసులుగా మారారు. తమతో కలిసి శిక్షణ పొందిన సహచరుడి భూజాన నీలిరంగు విజిల్ కార్డు ఉంటే తమపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయన్న మనోవేదనకు గురవుతున్నారు.

సీఎం ఆదేశాలు బేఖాతర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కరీంనగర్ పర్యటించినప్పుడు 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన పోలీసు అధికారులు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం చేయాలని విన్నవించారు. వారి సమస్యను విన్న సీఎం వెంటనే వరంగల్ జోన్ లోని 1995 బ్యాచ్‌కు చెందిన వారికి ఏసీపీలుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా బ్యాచ్‌కు చెందిన వారిని ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకుని ఉన్నతాధికారులతో చర్చలు జరిపించి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల 1995 బ్యాచ్ ఎస్సైల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కానీ, ఈ ప్రక్రియ తాత్కాలికమే అయితే మాత్రం మిగతా బ్యాచ్ ల వారికి అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. ఉద్యమ సమయంలో కేసీఆర్ వరంగల్ జోన్ పోలీసులకు అన్యాయం జరుగుతోందని గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతే వెంటనే ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జోన్ పోలీసుల పదోన్నతుల ఫైలుకు మోక్షం కలిగి 1989 బ్యాచ్ వారిని డీఎస్పీలను చేసింది.

ఆ తరువాత ఈ విషయం గురించి పట్టించుకున్నవారే లేకపోవడంతో ఆ తరువాత బ్యాచ్‌ల పోలీసు అధికారుల పదోన్నతులకు బ్రేక్ పడింది. తాజాగా సీఎం కేసీఆర్ ను కలిసి పోలీసు అధికారులు విన్నవించడంతో 1995 బ్యాచ్ వాళ్ల ఫైలు కదలిక స్టార్ట్ అయింది. అయితే పదోన్నతుల ప్రక్రియ విషయంలో శాశ్వతమైన పరిష్కారం తీసుకునేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ జోన్ కు చెందిన 1996 బ్యాచ్, వరంగల్ జోన్ లోని 1995 బ్యాచ్ వారికి ఒకే సారీ డీఎస్పీలుగా పదోన్నతి రానుంది. దీనివల్ల సీనియర్లు, జూనియర్లు ఏకకాలంలో ప్రమోషన్ పొందుతుంటే, వరంగల్ జోన్ లోని 1996 బ్యాచ్ సీఐలు జూనియర్లుగా మారిపోతున్నారు.

అధికారుల తప్పిదాలు..

ప్రమోషన్ల విషయంలో జోన్లవారీగా చేపట్టిన అధికారులు సీనియారిటిని పరిగణనలోకి తీసుకోవడంలో విచిత్ర వైఖరి కనబరుస్తున్నారు. విధుల్లో చేరినవారి సీనియారిటీతో పదోన్నతులు కల్పించాల్సిన అధికారులు వరంగల్ జోన్ వారికి సకాలంలో సీఐలుగా ప్రమోషన్ ఇవ్వకుండా చేసిన తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నాలు ఏనాడూ జరగలేదు. దీంతో సీఐలుగా పదోన్నతి పొందినవారే సీనియర్లు కాబట్టి ముందుగా ప్రమోషన్ వచ్చిన వారికి ముందుగా పదోన్నతి కల్పిస్తామన్న వాదన తీసుకస్తున్నారు. డ్యూటీలో జాయిన్ అయిన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే సీనియర్లు ఎవరన్నది తేలుతుంది కానీ ఉన్నతాధికారుల నజర్ అంతా కూడా హైదరాబాద్ జోన్ పైనే ఉంటోంది. దీంతో డిసిప్లేనరి డిపార్ట్ మెంట్ గా పేరొందిన పోలీసు విభాగంలోనే డిసిప్లేన్ లేకుండా పోయిందన్న విషయం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. శాశ్వతమైన పరిష్కారం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత కూడా చొరవ చూపేవారే లేకుండా పోయారు.

ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రెండు జోన్లే ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా బ్యాచ్‌లవారీగా పదోన్నతులు కల్పిస్తే రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. శిక్షణ సమయంలో కనబర్చే ప్రతిభను ఆధారం చేసుకుని ప్రమోషన్లు ఇస్తే కూడా బాగుంటుందన్నది కూడా పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా సీనియర్లు, జూనియర్లకు సెల్యూట్ చేసే పరిస్థితి ఎదురవుతోందన్న విషయాన్ని గుర్తించి పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే భావి తరాలకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బావుంటుంది.

Advertisement

Next Story

Most Viewed