గురు గ్రహం మీద తుఫానులు

by Harish |
గురు గ్రహం మీద తుఫానులు
X

దిశ, వెబ్‌డెస్క్: సౌరకుటుంబంలో ఇతర గ్రహాల మీద వాతావరణం ఎలా ఉంటుందనే సబ్జెక్ట్.. అటు సైన్స్ ఔత్సాహికులతో పాటు ఇటు సాధారణ ప్రజలకు కూడా ఆసక్తే. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గురు గ్రహం ఫొటో చూస్తే ఆర్టిస్టిక్ యాంగిల్ ఉన్నవారు కూడా ఆసక్తి చూపించక మానరు. గురు గ్రహం మీద ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడుతున్న తుఫానుల ఫొటోను నాసా విడుదల చేసింది. గ్యాస్‌తో నిండిన ఆ గ్రహంలో ఏర్పడిన ఈ తుఫానులను చూస్తుంటే ఏదో పెయింటింగ్ చూసిన అనుభూతి కలుగుతోంది. ఉత్తర ధ్రువం మధ్యలో ఒక పెద్ద తుఫాను, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న తుఫానులు చూడటానికి చక్కగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

నాసా వారి జూనో మిషన్‌లో భాగంగా చేస్తున్న పరిశోధనలో ఈ ఫొటో లభించింది. నాసా లెక్క ప్రకారం ఈ తుఫానుల పరిధి 2500 మైళ్ల నుంచి 2900 మైళ్ల వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి తుఫానులే గనక భూమ్మీద వస్తే గ్రహం మొత్తాన్ని సులభంగా పీల్చుకునేవని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తుఫానులకు ప్రత్యేకంగా ఎలాంటి రంగు ఉండదని, జూనోలో ఉపయోగించిన జోవియన్ ఇన్‌ఫ్రారెడ్ అరోరల్ మ్యాపర్ పరికరం కారణంగా ఇలాంటి చిత్రం ఉత్పన్నమైనట్లు వారు తెలిపారు. కేవలం ఉత్తర ధ్రువం మీదే కాదు, దక్షిణ ధ్రువం మీద కూడా ఇలాంటి తుఫానులు వస్తాయని వారు వివరించారు. ఫిబ్రవరి నుంచి జులై మధ్య వచ్చిన వివిధ తుఫాన్ల ఫొటోలను ఒక్కచోట చేర్చి సిటిజన్ సైంటిస్ట్ గెరాల్డ్ ఎకిస్టాడ్ ఈ చిత్రాన్ని సృష్టించాడు.

Advertisement

Next Story