బంగారు రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్

by Harish |
బంగారు రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రస్తుత పండుగ సీజన్‌లో వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్‌లపై రుణాలకు వడ్డీ రేట్లను 1.45 శాతం తగ్గిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జీబీ)పై 7.2 శాతం, బంగారు రుణాలు, ఆభరణాలపై 7.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా గృహ రుణాలపై వడ్డీ రేట్లను సైతం తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీన్ని 6.60 శాతానికి పొందవచ్చని, కారు రుణాలను 7.15 శాతం, వ్యక్తిగత రుణాలను 8.95 శాతానికే ఇస్తున్నామని తెలిపింది.

బ్యాంకింగ్ రంగంలోనే అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నట్టు బ్యాంకు వివరించింది. ఈ మధ్యనే పీఎన్‌బీ బ్యాంకు వినియోగదారులకు గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పండుగ సీజన్ కోసం బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్లపై కూడా ఈ సేవల ఛార్జీలను పూర్తిగా తొలగిస్తున్నామని బ్యాంకు తెలిపింది. వీటితో పాటు అదనంగా గృహ రుణాలపై మార్జిన్స్‌ను కూడా తగ్గించింది. గృహ రుణాలను తీసుకోవాలనుకునే వినియోగదారులు రుణ మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా ఆస్తి విలువలో 80 శాతం వరకు పొందవచ్చని వెల్లడించింది.

Advertisement

Next Story