లాక్‌డౌన్‌తో ముందే అప్పులకు..

by Shyam |
లాక్‌డౌన్‌తో ముందే అప్పులకు..
X

– ఆర్బీఐ తలుపు తడుతున్న రాష్ట్రాలు

దిశ, న్యూస్ బ్యూరో‌: ‌కరోనా మహమ్మారి (కోవిడ్ -19) వ్యాప్తి నిరోధానికి చేపట్టిన లాక్‌డౌన్‌తో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు వచ్చే ఆదాయం 90శాతానికిపైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రాలు ప్రతి ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటులో భాగంగా జీడీపీలో 3 శాతం వరకు వేలకోట్లలో చేసే స్టేట్ డెవలప్‌మెంట్(ఎస్డీఎల్) అప్పులలో ఎక్కువ శాతాన్ని ప్రీపోన్ చేసుకున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న ఏప్రిల్ నెలలోనే వార్షిక అప్పుల్లో ఎక్కువభాగం తెచ్చుకోవగానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తలుపు తడుతున్నాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2019-20)తో పోలిస్తే రాష్ట్రాలు తాజాగా స్టార్టైన ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) ఏప్రిల్ నెలలో చేసే అప్పులు 35శాతం పెరిగిపోయాయి.

అప్పులతోనే ఆర్థిక సంవత్సరం ప్రారంభం..

రాష్ట్రాలన్నీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో చేసిన అప్పులు రూ. 36వేల కోట్లుండగా ప్రస్తుతం ఆ మొత్తం రూ. 55 వేల కోట్లకు చేరింది. ఈ గణాంకాలను స్వయంగా ఆర్బీఐయే వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికమైన జాన్ క్వార్టర్ పరంగా చూసుకున్నా రాష్ట్రాలు చేయబోయే అప్పులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ.17వేల కోట్లు పెరగనున్నాయి. అంటే లాక్‌డౌన్ వల్ల ఆదాయం లేక కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభించాల్సిన దుస్థితిలో రాష్ట్రాలున్నాయని తెలుస్తోంది. కాగా, ముందుగా మార్చి 22న ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పాటించాయి. దీని తర్వాత తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను కంటిన్యూ చేస్తూ పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి. వెంటనే ప్రధాని మోడీ ఏప్రిల్ 14 దాకా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యావసరాలు, ఫార్మా, బ్యాంకింగ్ లాంటి సెక్టార్లు తప్ప మిగతా అన్ని తయారీ, సేవా రంగాలకు చెందిన యూనిట్లు, ఆఫీసులు, దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రాలు, వాటి ఆర్థిక వ్యవస్థలకు దన్నుగా ఉండే మెట్రో నగరాల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలంతా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనాలు వస్తాయన్న క్లారిటీ సైతం లేకుండా పోయింది. నిత్యావసరాలు తప్ప అన్ని రకాల కొనుగోళ్లను ప్రజలు ఆపేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, రోడ్ ట్యాక్స్ రూపంలో వచ్చే మొత్తం పన్ను ఆదాయం తగ్గిపోయింది. ఇవన్నీ రాష్ట్రాలు సాధారణ షెడ్యూలు కంటే ముందే ఏప్రిల్‌లోనే ఎక్కువ అప్పుకోసం ఆర్బీఐ తలుపు తట్టడానికి కారణాలయ్యాయని స్పష్టమవుతోంది.

ఓ పక్క అప్పులు, మరోపక్క ఖర్చుల తగ్గింపు..

ఓ పక్క సాధారణ షెడ్యూల్ కంటే ముందే అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రాలు మరో పక్క సాధారణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు తమ ఉద్యోగుల మార్చి నెల జీతాల్లో కోత పెట్టడం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రకటించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు తమ ఉద్యోగుల మార్చి నెల జీతాల్లో కోత పెట్టగా మహారాష్ట్ర, ఏపీ మాత్రం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని వెల్లడించింది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రాల ఆదాయం మార్చి నెలలో జనతా కర్ఫ్యూ రోజు నుంచి 8 రోజులే ఎఫెక్టయినప్పటికీ ఏప్రిల్ నెలలో మాత్రం 15 రోజుల ఆదాయం పూర్తిగా పడిపోనుంది. అయితే, లాక్ డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తుందా మళ్లీ పొడిగించే పరిస్థితులుంటాయా అన్నది రాష్ట్రాల ముందున్న సమాధానం లేని పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. దీంతో అవి తమ ఉద్యోగుల జీతాల కోత విధించి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అప్పలు ఎక్కువగా తెచ్చుకొని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదలకు బియ్యం, నగదు ఇచ్చి ఆదుకోవడానికి, కరోనాతో యుద్ధం చేస్తున్న ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు ప్రత్యేక నిధులు ఖర్చుచేయాల్సిన పరిస్థితిలో రాష్ట్రాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ ముగిసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప రాష్ట్రాల ఖజానాకు నిధుల ప్రవాహం మళ్లీ స్టార్టయ్యే చాన్సెస్ లేవని తెలుస్తోంది.

Tags: corona, lockdown, financial crisis, states, rbl, loan

Advertisement

Next Story