లాక్‌డౌన్‌పై రేపు సీఎం నిర్ణయం

by Shyam |
లాక్‌డౌన్‌పై రేపు సీఎం నిర్ణయం
X

దిశ, న్యూస్ బ్యూరో: నాల్గొ విడత లాక్‌డౌన్ సోమవారం నుంచి ప్రారంభం కానుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉంది. కానీ సోమవారం మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై చర్చించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఏయే జోన్లలో ఎలాంటి సడలింపులు ఇవ్వాలి, ఎలాంటి ఆంక్షలను అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. రాష్ట్రంలోని పరిస్థితులు, అనుసరించాల్సిన విధానం, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అవసరమైన వ్యూహం తదితరాలన్నింటిపై ఈ సమావేశం అనంతరం స్పష్టత రానుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన దృష్ట్యా రాష్ట్రంలో ఆ సర్వీసులపై ప్రభుత్వం మంత్రివర్గంతో చర్చించిన తర్వాత విధాన నిర్ణయం తీసుకోనుంది.
క్యాబ్ సర్వీసులు, హెయిర్ కటింగ్ సెలూన్‌లు, షాపింగ్ మాల్స్ మినహా మిగిలిన దుకాణాలు తెరవడం, పరిశ్రమలు పనిచేయడం, ప్రైవేటు ఆఫీసుల్లో పూర్తి స్థాయి సిబ్బంది విధులకు హాజరుకావడం.. ఇలా అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర మార్గదర్శకాలు వచ్చిన తర్వాత రాష్ట్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వెల్లడికానున్నాయి. ఈ సమావేశంలోనే వ్యవసాయ రంగానికి సంబంధించి సాగు నియంత్రిత విధానంపై కూడా నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Next Story