కేసీఆర్ నీకో న్యాయం.. రైతులకో న్యాయమా? : బండి

by Anukaran |   ( Updated:2020-12-07 12:02:14.0  )
కేసీఆర్ నీకో న్యాయం.. రైతులకో న్యాయమా? : బండి
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రేపు (మంగళవారం) రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పండించిన పంటను గిట్టుబాటు ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ రైతులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలా..? ఇదేం న్యాయం..? రైతులకు మేలు చేసేందుకే మోదీ సర్కారు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు.

కేంద్ర వ్యవసాయ సంస్కరణలకు మద్దతుగా, టీఆర్ఎస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా 3 లక్షల మంది రైతులు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే ఇంతవరకు నోరుమెదపలేదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెరాస సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. సన్న వడ్లు పండించి నష్టపోయిన రైతులకు రూ.2,500 బోనస్ ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు.

కేసీఆర్ విచిత్రమైన వ్యవహార శైలి చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పలేని కేసీఆర్ అకారణంగా వ్యతిరేకించడం సిగ్గుచేటని విమర్శించారు.

రేపు జరిగే బంద్ కేవలం టీఆర్ఎస్ పార్టీ బంద్ మాత్రమే. రైతులెవ్వరూ మోసపోవద్దు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజల తీర్పుతో మైండ్ బ్లాక్ అయి ఆ ఫలితాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఈ బంద్‌కు పిలుపు నిచ్చిండు. రైతులెవ్వరూ ఈ కృత్రిమ బంద్‌కు మద్దతు తెలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సంజయ్ వివరించారు.

అదే విధంగా, దేశంలో ఏనాడు రైతుల పట్ల కనీసం కనికరం చూపించని కాంగ్రెస్, నేడు కృత్రిమ ఉద్యమాలకు మద్దతివ్వడం సిగ్గుమాలిన చర్యగా ఎంపీ బండి సంజయ్ అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed