సీఎం వైఎస్ జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

by srinivas |
MK Stalin
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్రప్రభుత్వం ఓడరేవుల చట్టంలో సవరణలను తీసుకువచ్చేందుక ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ముసాయిదాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. ఆ బిల్లు చట్టరూపం దాల్చితే తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్ర నష్టాన్ని కలుగుతుందని ఆయన వాదిస్తున్నారు. ఈ చట్టం- తీర ప్రాంత రాష్ట్రాల హక్కులకు తూట్లు పొడుస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడరేవులు, అందులో సాగే కార్యకలాపాలపై ఇప్పటికే సర్వ హక్కులనూ కేంద్రం స్వాధీనం చేసుకుందని..ఇప్పుడున్న అరకొర అధికారాలు కూడా కేంద్రం వశమౌతాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతోన్నారు.

ఈ దిశగా కూటమి కట్టే ప్రయత్నం చేస్తోన్నారు. అందులో భాగంగా తీర ప్రాంతంలో ఉన్న తొమ్మి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, గుజరాత్-విజయ్ రుపాణీ, మహారాష్ట్ర-ఉద్ధవ్ థాకరే, గోవా-ప్రమోద్ సావంత్, కర్ణాటక-బీఎస్ యడియూరప్ప, కేరళ-పినరయి విజయన్, ఒడిశా-నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్- మమతా బెనర్జీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిలకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఓడరేవుల చట్టం 2021లో కేంద్ర ప్రభుత్వం తాజా చేపట్టదలిచిన సవరణల వల్ల తమ రాష్ట్రాల్లో ఉన్న ఓడరేవులపై ఆయా ప్రభుత్వాలన్నీ అధికారాలను కోల్పోతాయని స్టాలిన్ లేఖల్లో పేర్కొన్నారు. దీన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం ఐక్య కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉందని, సమష్ఠిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా సవరణల వల్ల చిన్నతరహా ఓడరేవుల పైన కూడా రాష్ట్రాలకు అధికారం ఉండదని హెచ్చరించారు. తాజా సవరణలపై ఇప్పటికే తమ అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన మ్యారిటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ భేటీలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ నిరసనను తెలియజేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story