సమ్మెకు దిగుతాం.. సర్కార్‌కు స్టాఫ్ నర్సుల హెచ్చరిక

by srinivas |
AP-Staff-Nurses-Union
X

దిశ, ఏపీ బ్యూరో : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. నెల్లూరు జీజీహెచ్ వద్ద స్టాఫ్ నర్సులు శుక్రవారం నిరసన తెలిపారు. రోగుల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న స్టాఫ్ నర్సుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా కొవిడ్ రోగులను కాపాడటం కోసం కొందరు స్టాఫ్ నర్సులు ప్రాణాలను సైతం కోల్పోయారని.. అయినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చెయ్యాలని.. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన నర్సింగ్ అధికారుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కొవిడ్ కోసం ప్రత్యేకంగా నియమించబడిన కాంట్రాక్టు నర్సింగ్ అధికారుల విధులు కొనసాగిస్తూ.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఒక్క స్టాఫ్ నర్స్‌కి రూ.50 లక్షల బీమా ప్రభుత్వమే చెల్లించి వర్తింపజేయాలన్నారు.

అలాగే ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 299 వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా సేవలను స్తంభింపజేసి సమ్మెకు దిగుతామని రాష్ట్ర స్టాఫ్ నర్సుల యూనియన్ గౌరవాధ్యక్షుడు యన్. సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు టివివి.ప్రసాద్, మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ నాయకులు సంధాని బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story