నిత్యావసరాలు మట్టిలో పూడ్చిపెట్టిన జీసీసీ సిబ్బంది

by Shyam |
buried essential goods
X

దిశ, కుకునూరు: మండల కేంద్రంలోని జీసీసీలో గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది నిత్యావసర సరుకులను మట్టిలో పూడ్చిపెట్టిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. లబ్ధిదారులు కాస్త ఆలస్యంగా రేషన్ కోసం వెళ్తే.. సరుకులు అందక నానాపాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 2019లో తయారు చేసిన రాగిపిండి, వేరుశనగ ప్యాకెట్ల సంచుల కొద్దీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని చెట్ల మాటున జీసీసీ సిబ్బంది పూడ్చివేశారు. అటు పంపిణీకి నోచుకోక ఇటు ప్రభుత్వానికి అప్పగించక పూడ్చిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్యాకెట్ల నుంచి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ధనం వృథా చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండేండ్ల నుంచి రాగిపిండి, వేరుశనగ ప్యాకెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉండటం కొసమెరుపు. కేవలం ప్యాకింగ్ చేసిన 6 నెలల్లో పంపిణీ చేయాల్సి ఉండగా రెండేండ్ల తరువాత వీటిని దహనం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. వీటి విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. కాగా ఈ విషయమై జీసీసీ అకౌంటెంట్ రాజయోగిని ‘దిశ ప్రతినిధి’ వివరణ కోరగా ప్యాకెట్ల గడువుతేది ముగిసిన విషయం టెండర్ వ్యాపారికి తెలియజేసినా.. స్పందించకపోవడంతో 26 బస్తాలను (ఒకొక్క బస్తా 50 కేజీలు) పూడ్చివేశారని విషయం వాస్తమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ ధనం వృథా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.

Advertisement

Next Story