ఆ క్రికెటర్లు.. ఇప్పుడు బస్ డ్రైవర్లు

by Anukaran |   ( Updated:2021-03-01 08:25:16.0  )
ఆ క్రికెటర్లు.. ఇప్పుడు బస్ డ్రైవర్లు
X

దిశ, స్పోర్ట్స్ : అది బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు. ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నది. ఆ ప్రాక్టీస్ చూడటానికి వెళ్లిన క్రీడా రిపోర్టర్‌ను ఒక నెట్ బౌలర్ ఆకర్షించాడు. అతడు బౌలింగ్ వేస్తున్న విధానం చూసి శ్రీలంక మాజీ క్రికెటర్ గుర్తుకు వచ్చాడు. అతడి బౌలింగ్ యాక్షన్.. బంతి విసురుతున్న వేగం అచ్చం సూరజ్ రన్‌దివ్ లాగే ఉండటంతో ఆశ్చర్చపోయాడు. ఆ తర్వాత ఆరా తీయగా ఆనాటి శ్రీలంక మాజీ ఆటగాడే.. ఇప్పుడు నెట్ బౌలర్‌గా ఆసీస్ జట్టుకు బంతులు విసురుతున్నాడని తెలిసింది. ఒక జాతీయ జట్టు బౌలర్ ఇన్నేళ్ల తర్వాత ఇలా నెట్ బౌలర్ ఎందుకయ్యాడని కనుక్కోగా… అనేక విషయాలు బయటపడ్డాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనే కాకుండా ఆస్ట్రేలియా జట్టుకు అప్పుడప్పుడు ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే.. అతడు అదే మెల్‌బోర్న్‌లో ఒక బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడితో పాటు చింతక నమస్తే (శ్రీలంక), వడ్డింగ్‌టన్ వాయేంగా (జింబాబ్వే) కూడా అదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

ముగ్గురూ అంతర్జాతీయ క్రికెటర్లే..

శ్రీలంకకు చెందిన రైట్ ఆర్మ్ స్పిన్నర్ సూరజ్ రన్‌దివ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. శ్రీలంక తరపున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రన్‌దీవ్ 2011 శ్రీలంక వరల్డ్ కప్ జట్టులో కూడా సభ్యుడు. టెస్టుల్లో 43, వన్డేల్లో 36, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. ఇతడికి ఫస్ట్ క్లాస్‌లో మంచి రికార్డే ఉన్నది. 149 మ్యాచ్‌లు ఆడిన రన్‌దివ్ 681 వికెట్లు తీశాడు. అంతే కాకుండా అతడు ఫస్ట్ క్లాస్‌లో 4 సెంచరీలు కూడా చేశాడు. చింతక నమస్తే శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2009లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నమస్తే.. 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఫాస్ట్ బౌలర్ అయిన వడ్డింగ్‌టన్ జింబాబ్వే తరఫున ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాడు. వీరిలో రన్‌దివ్‌కు మాత్రమే ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్నది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2011, 2013లో ఆడిన రన్‌దివ్ ఐపీఎల్ ద్వారా రూ. 75 లక్షల వరకు సంపాదించాడు. అయితే ప్రస్తుతం వీరి ముగ్గురి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బస్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

మెల్‌బోర్న్‌లో డ్రైవర్లు..

శ్రీలంక, జింబాబ్వేకు చెందిన ఈ ముగ్గురు క్రికెటర్లు తొలుత ఆస్ట్రేలియాకు క్లబ్ క్రికెట్ ఆడటానికి వెళ్లారు. అయితే దాని ద్వారా వీరికి తగినంత ఆదాయం లేకపోవడంతో మెల్‌బోర్న్‌లో బస్సులు తిప్పే ఫ్రెంచ్ కంపెనీ ట్రాన్స్‌డేవ్‌లో డ్రైవర్లుగా చేరారు. క్లబ్ మ్యాచ్‌లు లేని సమయంలో వీళ్లు ఆ బస్సులు నడుపుతూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. వీరి ముగ్గురిలో సూరజ్ రన్‌దివ్‌కు అంతర్జాతీయ అనుభవంతో పాటు సుదీర్ఘ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ అనుభవం ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని నెట్ బౌలర్‌గా ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వేతనాల్లో కోత విధంచడంతో సూరజ్‌పై ఆ ప్రభావం పడింది. దీంతో అతడు ఆ బస్ కంపెనీలో ఉద్యోగాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ఈ ముగ్గురు క్రికెటర్లు విక్టోరియా ప్రీమియర్ లీగ్‌లో డాండింగ్ క్రికెట్ క్లబ్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Advertisement

Next Story