రూ.15లక్షలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్ఐ

by Sumithra |
రూ.15లక్షలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్ఐ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వివాదంలో బంజారాహిల్స్‌ ఎస్ఐ రవీంద్ర‌నాయక్‌కు కూడా రూ.1.5లక్షలు ఇచ్చినట్లు బాధితుడు చెప్పడంతో ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు చిక్కడపల్లిలోని షేక్‌పేట తహసీల్దార్ సుజాత నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

షేక్‌పేట మండలంలోని ఎకరంనర స్థలంలో రెవెన్యూశాఖ బోర్డు ఏర్పాటు చేయగా.. ఆ భూమి తనదంటూ సయ్యద్ అబ్దుల్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. వివరాలన్నీ పరిశీలించిన న్యాయస్థానం ఆ స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనని తీర్పునివ్వడంతో లాక్‌డౌన్ సమయంలో రెవెన్యూ అధికారులు బోర్డును తొలగించారు. ఇదే క్రమంలో తమ స్థలం హద్దులు చూపించాలంటూ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో సయ్యద్ అబ్దుల్ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టరేట్‌లో ఓ కీలక అధికారికి రూ.50లక్షలు ఇవ్వాలని చెప్పడంతో చివరకు రూ.30లక్షలకు డీల్ కుదిరింది. ఈ విషయాన్ని సయ్యద్ అబ్దుల్ ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలోనే శనివారం ఆర్‌ఐ నాగార్జున‌రెడ్డి రూ.15లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.

నాగార్జునరెడ్డిపై గతంలోనూ అవినీతి ఆరోపణలు

ప్రస్తుతం షేక్‌పేట ఆర్ఐగా పనిచేస్తున్న నాగార్జున‌రెడ్డి గతంలో ఆసిఫ్‌నగర్, మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయాల్లో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆర్ఐ నాగర్జున ఎక్కడ పనిచేసినా ఆ కార్యాలయంలోని అధికారులను, సిబ్బందిని తన చేతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆసిఫ్‌నగర్ మండలంలో స్థానిక మంగార్‌బస్తీకి చెందిన వారి సర్టిఫికెట్ల జారీకి డబ్బులు డిమాండ్ చేసినందుకే కార్యాలయంపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఆ సమయంలో నాగర్జునరెడ్డిని మారేడ్‌పల్లి మండలానికి పంపించగా అక్కడ కూడా అటెండెన్స్ వేసుకుంటూ ఆసిఫ్‌నగర్ మండలంలో పనిచేయడం వెలుగుచూసింది. ఇలా గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న సంగతి పత్రికల్లో రావడంతో మళ్లీ అక్కడికి వెళ్లిపోయారు.

Advertisement

Next Story