లాక్‌డౌన్ తంత్రం.. అభివృద్ధి మంత్రం

by Shyam |
లాక్‌డౌన్ తంత్రం.. అభివృద్ధి మంత్రం
X

– వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బల్దియా

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్‌‌తో గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్ డైవర్సన్స్, ఇతర సమస్యలు ఏమీ ఇప్పుడు ఉండవు. ఇదే అవకాశంగా నగర అభివృద్ధిపై బల్దియా దృష్టి సారించింది. నగరవ్యాప్తంగా ఎస్ఆర్‌డీపీ, సీఆర్ఎంపీ పనులను పూర్తి చేసేందుకు వేగంగా కదులుతోంది. ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు మరో వైపు నగర అభివృద్ధిపై దృష్టి సారించింది.

రెండు నెలల ముందే..

మార్చి 23 నుంచి లాక్ డౌన్ మొదలవ్వగా అదే నెల 27 నుంచి సిటీలోని పెండింగ్ పనులను బల్దియా మొదలు‌పెట్టింది. అందుబాటులో ఉన్న గుత్తేదారులు, యంత్రాలు, కూలీలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నాలాల విస్తరణ కోసం పనులు చేస్తున్నామని ఇంజినీరింగ్ అధికారులు వివరిస్తున్నారు. సాధారణ అంచనాలతో పోలిస్తే లాక్‌డౌన్‌ను ఉపయోగించుకుని అంచనాల కంటే 2 నెలల ముందే పనులు పూర్తి చేస్తామని బల్దియా యంత్రాంగం ప్రకటిస్తోంది.

ఎస్ఆర్‌డీపీ, సీఆర్ఎంపీలో భాగంగా..

జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహాదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్డీపీ) కింద రూ.2,399 కోట్ల పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అంచనా. ప్రస్తుతం రూ.834 కోట్ల విలువైన 11 ప్రాజెక్టుల్లో పనులు కొనసాగిస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఓ ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ నిర్మాణం ఊపందుకుంది. దీంతో పాటు నాగోల్ జంక్షన్‌లో ఆరు లైన్ల ఫ్లైఓవర్, కామినేని జంక్షన్, బైరమాల్ గూడ, ఓవైసీ హాస్పిటల్, బయోడైవర్సిటీ జంక్షన్ల వద్ద మూడు లైన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నాలుగు లైన్ల ఎలివేటేడ్ కారిడార్ పనుల కోసం రోడ్లు మూసివేసి పనులు చేపట్టారు. రూ.49.3 కోట్లతో చేపట్టిన పంజాగుట్ట శ్మశాన వాటిక, స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాంప్రెహెన్సివ్ రోడ్స్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 709 కిలో మీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2020 జూన్ నాటికి 331 కిలోమీటర్ల పనులు పూర్తిచేసేందుకు ఏజెన్సీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ లాక్‌డౌన్ రోజులను ఉపయోగించుకుని పనులు పూర్తి చేసేందుకు ఆయా ఏజెన్సీలు పనిచేస్తున్నారు. సుమారు 130 కిలోమీటర్ల వరకూ పనులను పూర్తిచేశాయి.

ప్రస్తుతం కొనసాగుతున్నవి..

ఎస్‌ఆర్‌డీపీ పనుల వివరాలు (రూ. కోట్లలో)

మొత్తం పనుల విలువ: (రూ.834.44 )

2020 జూన్ వరకు పూర్తి చేయాల్సింది: రూ.436.52

ఇప్పటివరకూ పూర్తి చేసింది: రూ.356.47

Tags: Lockdown, GHMC, CRMP, SRDP, Development, hyderabad

Advertisement

Next Story