WPL 2025 : ఢిల్లీ ఆల్‌రౌండ్ షో.. గుజరాత్ చిత్తు

by Harish |
WPL 2025 : ఢిల్లీ ఆల్‌రౌండ్ షో.. గుజరాత్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది. గత మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు గెలుపు బాట పట్టింది. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కష్టంగా 127 స్కోరు చేసింది. భారతి ఫుల్మలి(40 నాటౌట్) రాణించింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. 15.1 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 131 రన్స్ చేసింది. జొనాస్సెన్(61 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ(44) కూడా రాణించింది.

జొనాస్సెన్ మెరుపులు

ఛేదనలో ఢిల్లీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ మెక్ లానింగ్(3) విఫలమవడంతో 14 పరుగులకే తొలి వికెట్ పడింది. అయితే, క్రీజులోకి వచ్చిన జొనాస్సెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొట్టింది. ఆమెకుతోడు షెఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించడంతో ఢిల్లీ విజయం సునాయసమైంది. అయితే, స్వల్ప వ్యవధిలో ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. షెఫాలీ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రోడ్రిగ్స్(5), సదర్లాండ్(1) నిరాశపరిచారు. మరోఎండ్‌లో దూకుడు మీద ఉన్న జొనాస్సెన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆమె అదే జోరును కొనసాగించడంతో ఢిల్లీ 15.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది.

ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా..

అంతకుముందు ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారతి పుల్మలి(40 నాటౌట్) పోరాటంతో అతి కష్టం మీద 127/9 స్కోరు చేసింది. ఆ జట్టుకు దక్కిన ఆరంభం చూస్తే ఆ స్కోరు చేయడం కూడా అద్భుతమే అని చెప్పాలి. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ టాపార్డర్ పూర్తిగా తేలిపోయింది. బెత్ మూనీ(10), హర్లీన్ డియోల్(5), లిచ్‌ఫీల్డ్(0), కెప్టెన్ గార్డ్‌నెర్(3), కావ్వీ గౌతమ్(0) పెవిలియన్‌కు క్యూట్టారు. దీంతో గుజరాత్ 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 రన్స్ లోపే ఆ జట్టు ఆలౌటవుతుందని అంతా భావించారు. కానీ, డియెండ్రా డాటిన్(26) విలువైన రన్స్ జోడించింది. ఆమె అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన భారతి ఫుల్మాలి గొప్ప పోరాట పటిమ కనబర్చింది. ఢిల్లీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఎదురుదాడికి దిగింది. ఆమె చివరి వరకు నిలిచి జట్టును ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మారిజన్నె కాప్, సదర్లాండ్ రెండేసి వికెట్లతో సత్తాచాటగా.. టిటాస్ సాదు, జొనాసెన్ చెరో వికెట్ తీశారు.


Next Story

Most Viewed