Aurangzeb row: మహారాష్ట్రలో హిందూ సంఘాల ఆందోళనలో ఉద్రిక్తత

by Shamantha N |
Aurangzeb row: మహారాష్ట్రలో హిందూ సంఘాల ఆందోళనలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు నాగ్ పూర్ లోని మహల్ ఏరియాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వీహెచ్ పీ కార్యకర్తలపై ఓ వర్గానికి చెందిన యువకులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ని ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చిట్నిస్ పార్క్, మహల్ ప్రాంతంలోని ఇళ్లపై కూడా రాళ్లు విసిరారు. హింసలో దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు

నాగ్ పూర్ ప్రజలకు సీఎం వినతి

కాగా, వదంతులు నమ్మొద్దని, శాంతియుతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాగ్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో స్పందించారు. హింసకు పాల్పడ వద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. నాగ్‌పూర్ సెంట్రల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దాట్కే హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని.. అన్ని సీసీటీవీ కెమెరాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, ఔరంగజేబు సమాధిని తొలగించాలని వీహెచ్ పీ కార్యకర్తలు సోమవారం మధ్యాహ్నం నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే నిరసనగారులు మొఘల్ చక్రవర్తి దిష్టిబొమ్మను 'చాదర్'తో కప్పి దానిని తగలబెట్టారు. అయితే, పవిత్ర గ్రంథాన్ని మంటల్లో వేశారని పుకార్లు వ్యాపించాయి. దీంతో, సోమ‌వారం రాత్రి అక్క‌డ స్వ‌ల్ప స్థాయిలో హింస చోటుచేసుకున్న‌ది. సోమ‌వారం రాత్రి 7 నుంచి 7.30 నిమిషాల మ‌ధ్య కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణాత్మాక వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Next Story

Most Viewed