16 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం

by Harish |
16 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ‘ఈ సాలా కప్ నమ్‌దే’.. అనేది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నినాదం. ‘ఈ సారి కప్పు మనదే’ అంటూ పురుషుల జట్టు ఐపీఎల్ బరిలో నిలిచిన ప్రతిసారి నిరాశే మిగిలింది. డబ్ల్యూపీఎల్ టైటిల్‌తో ఆ నిరాశకు తెరదించింది స్మృతి మంధాన సేన.

డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కంగారు ఉండే ఉంటుంది. అందులోనూ ఫైనల్. అంతేకాకుండా, టైటిల్ పోరు కంటే ముందు ఢిల్లీపై గెలిచిన దాఖలాలు లేవు. అభిమానుల్లోనూ ఆర్సీబీ గెలుస్తుందన్న అంచనాలు కూడా తక్కువే. కానీ, ఫైనల్‌లో అంచనాలన్నింటినీ బెంగళూరు పటాపంచలు చేసింది. ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే టైటిల్ ముద్దాడింది. మరోవైపు, ఢిల్లీకి వరుసగా రెండో సారి నిరాశే మిగిలింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2 చాంపియన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. ఫైనల్‌కు చేరుకున్న తొలి సారే ఆ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోయింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటుతో తేలిపోయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఆ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. షెఫాలీ వర్మ(44) టాప్ స్కోరర్. షెఫాలీ వర్మ అందించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేకపోయిన ఢిల్లీ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్(4/12), మోలినెక్స్(3/20) బంతితో చెలరేగి ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 19.3 ఓవర్లో 115/2 స్కోరు చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలీస్ పెర్రీ(35 నాటౌట్), సోఫి డివైన్(32), స్మృతి మంధాన(31) సమిష్టిగా రాణించారు. రిచా ఘోష్(17 నాటౌట్) ఫోర్ కొట్టి జట్టు విజయాన్ని లాంఛనం చేసింది.

ఆఖరి ఓవర్‌లో..

114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదన బెంగళూరుకు అంత సులభంగా సాగలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తూ ఆర్సీబీపై ఒత్తిడి పెంచారు. అయితే, లక్ష్యం చిన్నదే కావడంతో ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుకు పోలేదు. మొదట ఓపెనర్లు స్మృతి మంధాన(31), సోఫి డివైన్(32) ఇన్నింగ్స్‌ను చక్కగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 49 పరుగులు జోడించింది. శిఖా పాండే బౌలింగ్‌లో డివైన్ అవుటవడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత స్మృతి మంధానకు ఎలీస్ పెర్రీ తోడైంది. ఆమెతో కలిసి 33 పరుగులు జోడించిన తర్వాత స్మృతి మంధాన పెవిలియన్ చేరింది. అప్పటికీ 82/2 స్కోరుతో ఉన్న బెంగళూరు చివరి ఐదు ఓవర్లలో విజయానికి ఇంకా 32 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో పెర్రీ.. రిచా ఘోష్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్‌లో 5 రన్స్ కావాల్సి ఉండగా తొలి రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతిని రిచా ఘోష్ ఫోర్ కొట్టడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మిన్ను మనికి చెరో వికెట్ దక్కింది.

ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ విలవిల

అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీకి ఓపెనర్లు షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) శుభారంభమే అందించారు. లానింగ్ నిదానంగా ఆడినా.. షెఫాలీ వర్మ మాత్రం బౌలర్లపై విరుచుకపడింది. సోఫి డివైన్, పెర్రీ, మోలినెక్స్ ఓవర్లలో బౌండరీలు బాదింది. దీంతో షెఫాలీ మెరుపులతో పవర్ ప్లేలో ఢిలీ జట్టు 61/0 స్కోరుతో నిలిచి భారీ స్కోరు దిశగా గట్టి పునాది వేసుకుంది. పవర్ ప్లే తర్వాత బెంగళూరు బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ వేగంగా పతనమైంది. 49 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. బౌలర్ మోలినెక్స్ ఢిల్లీ పతనానికి శ్రీకారం చుట్టింది. ఒకే ఓవర్‌లో షెఫాలీ వర్మతోపాటు రోడ్రిగ్స్(0), అలీస్ క్యాప్సే(0)ను పెవిలియన్ పంపి భారీ దెబ్బ కొట్టింది. అనంతరం శ్రేయాంక పాటిల్, ఆశా శోభన ధాటికి ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. లానింగ్‌ను శ్రేయాంక వికెట్లు ముందు దొరకబుచ్చుకోగా.. ఆశా శోభన బౌలింగ్‌లో మారిజన్నె కాప్(8), జొనాస్సెన్(3) అవుటవడంతో ఢిల్లీ కోలుకోలేదు. మిన్ను మని(5), రాధా యాదవ్(12) వికెట్లు పారేసుకోగా.. శ్రేయాంక బౌలింగ్‌లో వరుస బంతుల్లో అరుంధతి రెడ్డి(10), తానియా భాటియా(0) వెనుదిరగడంతో ఢిల్లీ ఆట 18.3 ఓవర్లలోనే ముగిసింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు, మోలినెక్స్ 3 వికెట్లతో సత్తాచాటారు. ఆశా శోభన రెండు వికెట్లు తీసింది.

‘బెంగ’తీరింది

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి టైటిల్ బెంగ తీరింది. 16 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ కప్పును అందించింది. ఐపీఎల్‌లో పురుషుల జట్టు ప్రతి సీజన్‌కు ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ టోర్నీలో అడుగుపెట్టడం ఏదో ఒక దశలో నిష్ర్కమించడం అలవాటుగా మారింది. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లో మహిళల జట్టు అదే నినాదంతో బరిలోకి దిగినా చెత్త ప్రదర్శన మూటగట్టుకుంది. ఈ సారి కూడా కాస్త తడబడినా పుంజుకుని టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఎలాగైతేనేం మహిళల జట్టు ఎట్టకేలకు 16 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిందని అభిమానులు సంతోషం పడుతున్నారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 113 ఆలౌట్(18.3 ఓవర్లు)

లానింగ్ ఎల్బీడబ్ల్యూ(బి)శ్రేయాంక పాటిల్ 23, షెఫాలీ వర్మ(సి)వారేహమ్(బి)మోలినెక్స్ 44, రోడ్రిగ్స్(బి)మోలినెక్స్ 0, అలీస్ క్యాప్సే(బి)మోలినెక్స్ 0, మారిజన్నె కాప్(సి)సోఫి డివైన్(బి)ఆశా శోభన 8, జొనాస్సెన్(సి)స్మృతి మంధాన(బి)ఆశా శోభన 3, రాధా యాదవ్ రనౌట్(మోలినెక్స్) 12, మిన్ను మని ఎల్బీడబ్ల్యూ(బి)శ్రేయాంక పాటిల్ 5, అరుంధతి రెడ్డి(బి)శ్రేయాంక పాటిల్ 10, శిఖా పాండే 5 నాటౌట్, తానియా భాటియా(సి)రిచా ఘోష్(బి)శ్రేయాంక పాటిల్ 0; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 64-1, 64-2, 64-3, 74-4, 80-5, 81-6, 87-7, 101-8, 113-9, 113-10

బౌలింగ్ : రేణుక(2-0-28-0), మోలినెక్స్(4-0-20-3), ఎలీస్ పెర్రీ(2-0-14-0), సోఫి డివైన్(1-0-9-0), వారేహమ్(3-0-16-0), శ్రేయాంక(3.3-0-12-4), ఆశా శోభన(3-0-14-2)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 115/2(19.3 ఓవర్లు)

స్మృతి మంధాన(సి)అరుంధతి రెడ్డి(బి)మిన్ను మని 31, సోఫి డివైన్ ఎల్బీడబ్ల్యూ(బి)శిఖా పాండే 32, ఎలీస్ పెర్రీ 35 నాటౌట్, రిచా ఘోష్ 17 నాటౌట్.

వికెట్ల పతనం : 49-1, 82-2

బౌలింగ్ : మారిజన్నె కాప్(4-0-20-0), అలీస్ క్యాప్సే(3-0-13-0), శిఖా పాండే(4-0-11-1), రాధా యాదవ్(1-0-18-0), అరుంధతి రెడ్డి(3.3-0-26-0), జొనాస్సెన్(2-0-15-0), మిన్ను మని(2-0-12-1)

Advertisement

Next Story