అమ్మాయిలకు అదిరే బోణీ.. మలేషియాపై భారీ విజయం

by Harish |
అమ్మాయిలకు అదిరే బోణీ.. మలేషియాపై భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా భారత మహిళల హాకీ జట్టు తొలి అడుగు వేసింది. టోర్నీని విజయంతో ఆరంభించింది. బిహార్ వేదికగా జరుగుతున్న టోర్నీలో సోమవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మలేషియాను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో విజయం సాధించింది. కుమారి సంగీత రెండు గోల్స్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి ఒక్క గోల్ కూడా చేయకుండా భారత ప్లేయర్లు నిలువరించారు. భారత్‌కు 8వ నిమిషంలోనే కుమారి సంగీత తొలి గోల్ అందించింది.

అంతకుముందు భారత్ రెండు పెనాల్టీ కార్నర్లను మిస్ చేసింది. మూడో పెనాల్టీ కార్నర్‌ను సంగీత ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మల్చడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం భారత్‌కు మరిన్ని పెనాల్టీ కార్నర్లు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు, మలేషియాకు కూడా గోల్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే, సెకండాఫ్‌లో భారత ప్లేయర్లు దూకుడు పెంచారు. స్వల్ప వ్యవధిలోనే మూడు గోల్స్ చేశారు. 43వ నిమిషంలో ప్రీతి గోల్ చేయగా.. ఆ తర్వాతి నిమిషంలోనే ఉదిత పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ఇక, 55వ నిమిషంలో సంగీత తన నుంచి రెండో గోల్ అందించడంతో భారత్ 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి ఐదు నిమిషంలో కూడా మలేషియా ఖాతా తెరవలేదు.

నేడు రెండో గ్రూపు మ్యాచ్‌లో సౌత్ కొరియాతో భారత్ తలపడనుంది. మరోవైపు, జపాన్, సౌత్ కొరియా జట్ల మధ్య జరిగిన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. అలాగే, మరో మ్యాచ్‌లో చైనా 15-0 తేడాతో థాయిలాండ్‌పై భారీ విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

Next Story