వింబుల్డన్ ఫైనల్‌కు అల్కరాజ్, జకోవిచ్

by Harish |
వింబుల్డన్ ఫైనల్‌కు అల్కరాజ్, జకోవిచ్
X

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్‌‌ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌‌లో అడుగుపెట్టారు. సెమీస్‌లో మెద్వెదెవ్‌ను అల్కరాజ్ చిత్తు చేయగా.. ముసెట్టిపై జకో విజయం సాధించాడు. ఆదివారమే టైటిల్ పోరు. గతేడాది ఫైనల్‌లో వీళ్లద్దరే తలపడగా.. వరుసగా రెండోసారి ఎదురుపడబోతున్నారు.

డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకోవడంపై కన్నేశాడు. వరుసగా రెండో సారి మెన్స్ సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అల్కరాజ్ 6-7(1-7), 6-3, 6-4, 6-4 తేడాతో 5వ సీడ్ మెద్వెదెవ్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొదట అల్కరాజ్‌కు షాక్ తగిలింది. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి సెట్‌ను మెద్వెదెవ్ టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్ నుంచి అల్కరాజ్ పుంజుకున్నాడు. మెద్వెదెవ్ నుంచి పోటీని తట్టుకుని నిలబడ్డాడు. అతని షాట్లకు కొన్ని సందర్భాల్లో మెద్వెదెవ్ వద్ద సమాధానమే లేకపోయింది. దూకుడుగా ఆడి వరుసగా మూడు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. అల్కరాజ్ 6 ఏస్‌లు, 55 విన్నర్లతో విరుచుకపడ్డాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరోవైపు, అల్కరాజ్‌తో పోలిస్తే మెద్వెదెవ్ తక్కువ తప్పిదాలే చేసినా కీలక సమయాల్లో వెనక్కి తగ్గాడు. 6 డబుల్ ఫౌల్ట్స్, 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో మెద్వెదెవ్ వరుసగా రెండోసారి సెమీస్‌లోనే తన పోరాటాన్ని ముగించాడు.

జకో 10వ సారి..

వింబుల్డన్‌లో జకోవిచ్ 10వ సారి ఫైనల్‌కు చేరుకున్నాడు. వరుసగా ఇది మూడోసారి. సెమీస్‌లో జకో 6-4, 7-6(7-2), 6-4 తేడాతో ఇటలీ ఆటగాడు ముసెట్టిపై విజయం సాధించాడు. 2 గంటల 48 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో జకో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుసగా మూడు సెట్లను నెగ్గాడు.

Advertisement

Next Story

Most Viewed