Paris Olympic : డ్యాన్సర్లే అథ్లెట్లు.. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్

by Harish |
Paris Olympic : డ్యాన్సర్లే అథ్లెట్లు.. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : బ్రేకింగ్.. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రేక్ డ్యాన్స్. ఇప్పటి వరకు బ్రేక్ డ్యాన్స్‌ను సినిమాల్లో లేదా ఏదైనా డ్యాన్స్ షోలో చూసుంటాం. కానీ, ఇప్పుడు పారిస్ విశ్వక్రీడల్లో చూడబోతున్నాం. ఓపెనింగ్ సెర్మనీలోనో లేదా క్లోజింగ్ సెర్మనీలోనో కాదు. పతక పోటీల్లో.. అవునండి.. ఇది నిజం. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్ ఓ క్రీడా ఈవెంట్.

బ్రేకింగ్‌ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ క్రీడగా గుర్తించింది. పారిస్ విశ్వక్రీడల్లో బ్రేక్ డ్యాన్స్‌ను ఓ క్రీడా అంశంగా చేర్చింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ కనిపించడం ఇదే తొలిసారి. 2018లో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బ్రేకింగ్‌ తొలిసారిగా ప్రదర్శించబడింది. పారిస్ విశ్వక్రీడల్లో పురుషుల(బీ-బాయ్స్), మహిళల(బీ-గర్ల్స్) ఈవెంట్లు జరగనున్నాయి. ప్రతి విభాగంలో 16 మంది పాల్గొంటారు. ఆగస్టు 9, 10 తేదీల్లో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రతి విభాగంలో నాలుగు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి ఇద్దరు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత సెమీస్, పతక పోటీలు నిర్వహిస్తారు. ఐదు గంటల్లో ఈ ఈవెంట్ ముగియనుంది.

విజేతను ఎలా నిర్ణయిస్తారు?

బ్రేకింగ్‌లో పాల్గొనే అథ్లెట్లను బ్రేకర్లుగా పిలుస్తారు. డ్యాన్స్ షోలో మాదిరిగానే జడ్జీలు బ్రేకర్లకు తమ ప్రదర్శన ఆధారంగా స్కోర్లు ఇస్తారు. అయితే, జడ్జీలు ఐదు కేటగిరీల్లో(సంగీతం, పదజాలం, వాస్తవికత, సాంకేతికత, అమలు) బ్రేకర్ పర్ఫామెన్స్‌ను అంచనా వేస్తారు. అలాగే, విస్తారమైన డ్యాన్స్ కదలికలు, గాలి మరల వంటి కదలికలు, ఆరు దశల ఫుట్‌వర్క్‌లతోసహా ఫ్రీజింగ్, డీజే వంటివి ఆధారంగా జడ్జీలు స్కోర్లు ఇస్తారు. ప్రతి రౌండ్‌లో అత్యధిక స్కోరు పొందిన వారు తర్వాతి రౌండ్‌కు చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed