ఇండియా పేరు మార్పుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-09-05 11:44:41.0  )
ఇండియా పేరు మార్పుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇండియా పేరును మారుస్తుందంటూ దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగుతుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇండియా పేరు మార్పు టాపిక్‌పై సోషల్ మీడియా వేదికగా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పేరును మార్చాలని చూస్తోన్న బీజేపీ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా, ఇండియా పేరు మార్పు వ్యవహారంపై టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

ఇండియా పేరు మార్పుపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా పేరును భారత్‌గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. ‘‘మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్‌ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా’’ అని సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు.

కాగా, ఇండియా పేరు మార్పు వ్యవహారం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇండియా పేరు భారత్‌గా మార్చబోతుందని దేశ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9, 10వ తేదీన ఇండియాలో జరగనున్న జీ20 సమావేశాలకు హాజరయ్యే దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరుకావాలని రాష్ట్రపతి భవన్ జీ20 దేశాధినేతలకు ఆహ్వన కార్డులు పంపింది. ఈ కార్డుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని అధికారులు పేర్కొనడంతో ఇండియా పేరు మార్పు వార్తలకు మరింత బలం చేకూరింది.

Advertisement

Next Story