US Open : వింబుల్డన్ చాంపియన్‌ క్రెజికోవాకు షాక్.. రెండో రౌండ్‌లోనే ఔట్

by Harish |
US Open : వింబుల్డన్ చాంపియన్‌ క్రెజికోవాకు షాక్.. రెండో రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌లో మూడో రోజే సంచలనం చోటుచేసుకుంది. వింబుల్డన్ చాంపియన్, చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. ఆమెకు అన్‌సీడ్ క్రీడాకారిణి ఎలెనా రూస్(రొమేనియా) షాకిచ్చింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రూస్ 6-4, 7-5 తేడాతో క్రెజికోవాను ఓడించింది. క్రెజికోవా వరుసగా రెండు సెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. 7 డబుల్ ఫౌల్ట్స్, 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రూస్ 3 డబుల్ ఫౌల్స్, 15 తప్పిదాలే చేసింది. అలాగే, 8 ఏస్‌లు, 28 విన్నర్లతో విరుచుకపడిన ఆమె నాలుగుసార్లు క్రెజికోవా సర్వీస్‌లను బ్రేక్ చేసి పట్టుసాధించింది. క్రెజికోవా సింగిల్స్, డబుల్స్‌లో కలిపి మొత్తం 12 గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకుంది. అలాగే, టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు, టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో రెబకినా(కజకిస్తాన్) టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో డెస్టానీ ఐవా(ఆస్ట్రేలియా)పై 6-1, 7-6(7-1) తేడాతో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది.

అల్కరాజ్ శుభారంభం

వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్‌లో హ్యాట్రిక్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. టైటిలే లక్ష్యంగా యూఎస్‌ ఓపెన్‌‌లో అడుగుపెట్టిన అతను టోర్నీలో శుభారంభం చేశాడు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో అల్కరాజ్ 6-2, 4-6, 6-3, 6-1 తేడాతో ఆస్ట్రేలియా ప్లేయర్ లి టుపై విజయం సాధించాడు. 2 గంటల 42 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ ఫలితం నాలుగు సెట్‌లో తేలింది. తొలి సెట్ అలవోకగా నెగ్గిన అల్కరాజ్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి షాకిచ్చాడు. అనంతరం బలంగా పుంజుకున్న అతను ప్రత్యర్థికి ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా మిగతా రెండు సెట్లను దక్కించుకుని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. గతేడాది ఫైనలిస్ట్ మెద్వెదెవ్ 6-3, 3-6, 6-3, 6-1 తేడాతో లాజోవిక్(సెర్బియా)ను ఓడించి ముందడుగు వేశాడు.

Advertisement

Next Story

Most Viewed