బజరంగ్, వినేష్‌లకు టాప్స్ ఆర్థిక సాయం

by S Gopi |
బజరంగ్, వినేష్‌లకు టాప్స్ ఆర్థిక సాయం
X

న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం(టాప్స్) కింద రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ పొగట్ విదేశాల్లో శిక్షణ పొందేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అనుమతించింది. కిర్గిస్తాన్, పోలాండ్‌లలో శిక్షణ తీసుకోవాలన్న వీరి ప్రతిపాదనను ఆమోదించింది. బజరంగ్ 16 రోజులు కిర్గిస్తాన్‌లోని చోల్పాన్-అటాలో శిక్షణ తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా.. వినేష్ 11 రోజులు స్పాలా (పోలాండ్‌)లోని ఒలింపిక్ ప్రిపరేషన్ సెంటర్‌లో శిక్షణ తీసుకోవాలని కోరుకుంది. అథ్లెట్ల రానుపోను విమాన ఖర్చులు, ట్రెయినింగ్, బోర్డింగ్, లాడ్జింగ్, ఇతరత్రా క్యాంప్ ఖర్చులు అంటే ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్, ఇన్‌ష్యూరెన్స్, ఇంటర్నల్ ట్రావెల్, పాకెట్ మనీ వంటి వాటిని టాప్ స్కీం భరిస్తుంది.

అంతేకాకుండా వినేష్ స్పారింగ్ పార్ట్‌నర్ సంగీత పొగట్, ఫిజియో అశ్వినీ జీవన్ పాటిల్ ఖర్చులను కూడా టాప్ భరిస్తుంది. ఇక భజరంగ్ విషయానికొస్తే అతని కోచ్ సుజీత్ మాన్, ఫిజియో ఆనంద్ కుమార్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనర్ ఎక్స్‌పర్ట్ కాజీ కిరణ్ ముస్తఫా హసన్ ఖర్చులను కూడా టాప్ ఇస్తుంది. అయితే రెజ్లింగ్ పర్యవేక్షణ కమిటీ సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించినప్పటికీ ఈ ఏడాది జరగనున్న సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్ కోసం భారత జట్టుకు కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. జాతీయ శిక్షణ శిబిరం స్పోర్ట్స్ అథారీటీ ఆఫ్ ఇండియా (సాయ్) కాంప్లెక్స్‌లోని సోనిపత్ రీజినల్ సెంటర్‌లో నిర్వహిస్తారు. ఇందులో 108 మంది రెజర్లు పాల్గొంటారు.

Advertisement

Next Story